తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానం !

Telugu Lo Computer
0


తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో తెలంగాణ నిలుస్తోంది. ఆర్దిక ప్రగతిలో ముందు వరుసలో ఉంది. బలమైన ఆర్దిక శక్తిగా ఎదుగుతోంది. తలసరి ఆదాయంలో జాతీయ సగటును దాటేసింది. గత ఎనిమిదేళ్ల కాలంగా సాగిస్తూ వస్తున్న ప్రగతిని కొనసాగిస్తోంది. తలసరి ఆదాయ వృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ వెల్లడించిన గణాంకాలు తెలంగాణలో ఏ విధంగా తలసరి ఆదాయం పెరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. నేషనల్‌ స్టాటిస్టికల్‌ ఆఫీస్‌ విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.1,24,104గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం ఇప్పుడు ఏకంగా రూ.3,17,115కి చేరింది. దీని ద్వారా గత తొమ్మిదేండ్లలో తెలంగాణ తలసరి ఆదాయం ఏకంగా 156 శాతం (రూ.1,93,001) వృద్ధి చెందినట్లు స్పష్టం అవుతోంది. ఇదే సమయంలో జాతీయ తలసరి ఆదాయం 98 శాతం వృద్ధితో రూ.86,647 నుంచి రూ.1,72,000కు పెరిగింది. దీనితో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 84.36 శాతం (రూ.1,45,115) ఎక్కువగా నమోదైందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తలసరి ఆదాయంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ముందంజలో ఉన్నాయి. తొమ్మిదేండ్లలో తెలంగాణ తలసరి ఆదాయం 155 శాతం పెరిగితే.. జాతీయ తలసరి ఆదాయంలో 96 శాతం మాత్రమే వృద్ధి నమోదు అయింది. తెలంగాణ తరువాతి స్థానాల్లో వరుసగా కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర అనుసరిస్తున్నాయి. గుజరాత్‌ 11వ స్థానంలో నిలిచింది. కాగా బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ అన్నింటి కంటే చివర వరుసలో ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని జిల్లాలు సరికొత్త రికార్డును లిఖించాయి. తలసరి ఆదాయంలో అన్ని జిల్లాలు జాతీయ తలసరి ఆదాయాన్ని మించి నమోదుచేసినట్లు గణాంకాలు నమోదయ్యాయి. ప్రస్తుత ధరల వద్ద 2020-21 ఆర్థిక సంవత్సరంలో జాతీయ తలసరి ఆదాయం రూ.1,26,855గా నమోదైంది. తెలంగాణలోని జిల్లాల కనిష్ఠ తలసరి ఆదాయం రూ.1,30,821గా ఉంది. అంటే.. జాతీయ ఆదాయం కన్నా రూ.3,966 అధికంగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)