ట్విట్టర్‌ బయోను మార్చిన రాహుల్ గాంధీ

Telugu Lo Computer
0


రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌ బయోలో మార్పులు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడిగా, డిస్‌క్వాలిఫైడ్‌ ఎంపీగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో ట్రెడింగ్‌ అవుతున్నది. 2019 ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ మాట్లాడుతూ.. 'దొంగలంతా మోదీ ఇంటి పేరు ఎందుకు పెట్టుకుంటారు?' అని అన్నారు. ఈ మేరకు నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, నరేంద్ర మోదీ అంటూ పలు పేర్లను ఉదహరించారు. దీనిపై సూరత్‌ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ.. రాహుల్‌పై పరువు నష్టం కేసు వేయగా, గురువారం సూరత్‌ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్‌ గాంధీ వివరణ ఇచ్చారు. కానీ, రాహుల్‌ ఆ వ్యాఖ్యలు చేశారని కోర్టు నిర్ధారించి, ఐపీసీ సెక్షన్‌ 499, 500 ప్రకారం.. దోషిగా తేల్చింది. రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ, పై కోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు శిక్షను 30 రోజుల పాటు నిలిపివేసింది. ఇంతలో రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని సచివాలయం రద్దుచేసింది. 'కేరళలోని వయనాడ్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్‌ గాంధీని కోర్టు దోషిగా ప్రకటించింది. తీర్పు చెప్పిన తేదీ (23 మార్చి, 2023) నుంచి ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేస్తున్నాం' అని లోక్‌సభ సచివాలయం నోటిఫికేషన్‌లో పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 8 ప్రకారం.. ఆర్టికల్‌ 102(1)(ఈ)లోని నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెక్రటేరియట్‌ వెల్లడించింది. అయితే 24 గంటల వ్యవధిలోనే లోక్‌సభ సచివాలయం ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేసింది. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

Post a Comment

0Comments

Post a Comment (0)