ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు

Telugu Lo Computer
0


మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అరెస్టయ్యారు. ఇవాళ మధ్యాహ్నం సీబీఐ విచారణకు వెళ్లిన ఆయన్ను అధికారులు అరెస్టు చేశారు. అంతకుముందు సిసోదియాను దాదాపు 8 గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అనంతరం అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయ పరిసరాల్లో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్‌ విధించారు. విచారణ సమయంలో మద్యం పాలసీ గురించి వివిధ కోణాల్లో సిసోడియాను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దినేశ్ అరోడా, ఇతర నిందితులతో గల సంబంధాలపై ఆరా తీశారు. వివిధ సందర్భాల్లో చేసిన ఫోన్‌ కాల్స్‌ గురించి అడిగినట్లు తెలుస్తోంది. అయితే, మనీశ్‌ సిసోదియా సమాధానాలతో తృప్తి చెందని సీబీఐ అధికారులు.. ఆయన విచారణకు సహకరించడం లేదని, కీలక అంశాల్లో ఆయన చెప్పిన సమాధానాలతో పొంతన కుదరకపోవడంతో అరెస్టు చేశామని చెబుతున్నారు. సిసోదియా నుంచి కీలకమైన సమాచారం రాబట్టాలంటే కస్టోడియల్‌ విచారణ అవసరమని అన్నారు. మరోవైపు సీబీఐ విచారణకు ముందు మనీశ్‌ సిసోదియా చేసిన ట్వీట్‌ సంచలనంగా మారింది. ''నేను ఈ రోజు సీబీఐ విచారణకు మరోసారి హాజరవుతున్నా. విచారణకు పూర్తిగా సహకరిస్తా. మరికొన్ని నెలలు జైలులోనే ఉండాల్సి వచ్చినా.. లెక్కచేయను. నేను భగత్‌సింగ్‌ను అనుసరించే వ్యక్తిని'' అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేస్తారని సిసోడియాకు ముందుగానే అర్థమైనట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)