బెంగాల్‌లో పెరుగుతున్న అడెనో వైరస్‌ కేసులు !

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్‌లో అడెనో వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో పిల్లలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. కోల్‌కతాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కలరా అండ్ ఎంటరిక్ డిసీజెస్‌కి జనవరి నుంచి పలు శాంపిల్స్‌ పంపినట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ శాంపిల్స్‌లో 32 శాతం మందికి పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. గత కొన్ని రోజులుగా వైరస్‌ సోకిన పిల్లలతో ఆసుపత్రులు నిండుతున్నాయని వెల్లడించారు. ఆదివారం ఇద్దరు పిల్లలు చనిపోయినట్లు వివరించారు. మరణించిన వారిలో ఒక బాలుని  వయసు ఆరు నెలలు కాగా, బాలిక వయసు రెండున్నర ఏళ్లు అని పేర్కొన్నారు. అయితే ఇద్దరి పిల్లల మరణానికి అడెనోవైరస్‌ కారణమన్నది అధికారికంగా గుర్తించలేదన్నారు. కాగా, అడెనోవైరస్ సోకడం వల్ల తేలికపాటి జలుబు లేదా ఫ్లూ, జ్వరం, గొంతు నొప్పి, తీవ్రమైన ఉపిరితిత్తుల సమస్య, న్యుమోనియా, కండ్లకలక, కడుపులో మంట, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ వంటి లక్షణాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. తేలికపాటి నుంచి తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుందని చెప్పారు. బలహీనమైన రోగనిరోధక శక్తి, శ్వాసకోశ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వ్యక్తులు అడెనోవైరస్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వివరించారు. అన్ని వయసుల వారిని ఈ వైరస్‌ ప్రభావితం చేస్తుందన్నారు. రోగులు దగ్గడం, తుమ్మడం, తాకడం వల్ల, మలమూత్రాల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)