మసీదుల్లో మహిళల నమాజ్ కు అనుమతి !

Telugu Lo Computer
0


దేశంలోని మసీదుల్లో మహిళల్ని నమాజ్ చేసుకునేందుకు అనుమతించవచ్చా లేదా అనే అంశంపై తమ అభిప్రాయాన్ని అఫిడవిట్ రూపంలో చెప్పాల్సిందిగా సుప్రీంకోర్టు ముస్లిం పర్సనల్ లా బోర్డును కోరింది. దీనిపై స్పందించిన అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు మసీదుల్లోకి నమాజ్ చేసేందుకు మహిళల ప్రవేశానికి అనుమతి ఉందని ఇవాళ సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే పురుషుల్ని, మహిళల్ని ఒకే వరుసలో నమాజ్ చేసేందుకు అనుమతించే విషయంలో మాత్రం అభ్యంతరాలు ఉన్నాయని వెల్లడించింది. ఇది ఇస్లాం సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. మసీదుల్లో మహిళల్ని నమాజ్ కు అనుమతించేట్లయితే వేర్వేరు ప్రాంగణాల్లో అనుమతించాలని సుప్రీంకోర్టుకు ముస్లిం పర్సనల్ లా బోర్డు సూచించింది. ఇస్లాం మత గ్రంథాలు, సిద్ధాంతాలు, మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుంటే, మసీదుల్లో నమాజ్ కోసం మసీదుల్లోకి మహిళల ప్రవేశం అనుమతించవచ్చని ముస్లిం పర్సనల్ లాబోర్డు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొంది. ఎక్కడ కొత్త మసీదులు నిర్మించినా మహిళలకు తగిన స్థలం కల్పించే అంశాన్ని గుర్తుంచుకోవాలని బోర్డు ముస్లిం సమాజానికి సైతం విజ్ఞప్తి చేసింది. 2020లో ఫర్హా అన్వర్ హుస్సేన్ షేక్ అనే మహిళ సుప్రీంకోర్టులో మహిళలకు మసీదుల్లో నమాజ్ కు అనుమతించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దేశంలోని మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశాన్ని నిషేధించే చర్యల్ని చట్టవిరుద్ధమైనవి, రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. ఈ పిటిషన్‌ను మార్చిలో సుప్రీంకోర్టు విచారించబోతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)