బీజేపీలో కోవర్టుల కలకలం!

Telugu Lo Computer
0


తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ కోవర్టులు, ఇన్‌ఫార్మర్లు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారన్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ వ్యాఖ్యలు కాషాయదళంలో తీవ్ర కలకలానికి దారితీశాయి. బీజేపీలో నిజంగానే కేసీఆర్‌ ఇన్‌ఫార్మర్లు ఉన్నారా? ఉంటే అలాంటి నాయకులెవరు? కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌కు పరోక్షంగా సహకరిస్తున్నది ఎవరు? అసలు ఈటల ఉద్దేశం ఏమిటన్న అంతర్గత చర్చకు కారణమయ్యాయి. ఈ సందేహాలను బలపర్చేలా ఇటీవల ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వెళ్తున్నారంటూ కొందరు నేతల పేర్లు ప్రాథమిక చర్చల సమయంలోనే లీకవడంపై రచ్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే కోవర్టులను గుర్తించి, కట్టడి చేయడంపై బీజేపీ ముఖ్యులు దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారంటూ కొందరు నేతలు చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఇటీవల ఆ పార్టీలో రచ్చకు కారణమయ్యాయి. పార్టీ వర్గాలు చీలి పోయి, ఆరోపణలు ప్రత్యారోపణల దాకా పరిస్థితి వెళ్లింది. ఇదే సమయంలో బీజేపీ సహా అన్ని పార్టీల్లో కేసీఆర్‌ కోవర్టులు ఉన్నారంటూ ఈటల రాజేందర్‌ పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈటల ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచి్చందనే దాని నుంచి బీజేపీలో ఎవరు కోవర్టులనే దాకా ఆ పార్టీ నాయకుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు ఇటీవల మీడియా ప్రతినిధులతో భేటీ సందర్భంగా ఆఫ్‌ ది రికార్డ్‌గా ఈటల చేసిన వ్యాఖ్యలపైనా చర్చజరుగుతోంది. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర పార్టీ చేరికల కమిటీ కన్వీనర్‌గానూ ఈటల వ్యవహరిస్తున్నారు. అలాంటిది తానే స్వయంగా కోవర్టుల ఆరోపణలు చేయడం, బీజేపీలో చేరబోయే ఇతర పార్టీల నేతల పేర్లు ముందుగానే లీక్‌ కావడంతో వారు వెనుకడుగు వేస్తున్నారని వ్యాఖ్యానించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. నిజానికి ఏ రాజకీయ పార్టీలోనూ చేరికల కోసం ప్రత్యేకంగా కమిటీ లేదని, బీజేపీలో కమిటీ ఏర్పాటు చేసినా చేరబోయే నేతల పేర్లు ప్రాథమిక దశలోనే ఎలా లీక్‌ అవుతున్నాయని పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)