పరిశుభ్రతను పాటించని ప్రయాణీకులు !

Telugu Lo Computer
0


వందే భారత్‌ రైళ్లలో పరిశుభ్రత లోపిస్తోంది. ప్రజలకు సౌకర్యవంతంగా మంచి ప్రయాణ అనుభూతిని కల్పించడానికి, తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకునే విధంగా వీటిని ప్రవేశపెట్టారు. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లలో ప్రయాణించే సమయంలో వాటిని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రయాణికులపై కూడా ఉంది. మంచినీళ్ల సీసాలు, పాలిథిన్ కవర్లు, ఆహార పదార్థాలు లాంటివి ఎక్కడికక్కడే వదిలేస్తున్నారు. చెత్తా చెదారంతో నిండివున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీ ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. అందులో ఓ పారిశుధ్య కార్మికుడు వాటిని శుభ్రం చేస్తున్నారు. అవనిష్ శరణ్ అనే ఐఏఎస్ అధికారి ఈ ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రజలు తమ హక్కుల కోసం పోరాడతారుకానీ, బాధ్యతలను విస్మరిస్తారని ఒకరు కామెంట్ పెట్టారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెడుతోంటే వాటిని ఎందుకు పరిశుభ్రంగా ఉంచరంటూ మరొక నెటిజన్ కామెంట్ పెట్టారు. దేశవ్యాప్తంగా 8 రూట్లలో వందే భారత రైళ్లు పరుగులు పెడుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య దీన్ని ప్రారంభించారు. భారత్ లో 400 వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టడానికి గత బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. వందే భారత్ రైళ్లను మూడేళ్లలో తయారు చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పగా పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు నడుస్తున్న వందే భారత్ రైలు సికింద్రాబాద్ లో బయలుదేరి విశాఖపట్నం వచ్చేసరికి, విశాఖపట్నంలో బయలుదేరి సికింద్రాబాద్ వచ్చేసరికి చెత్తబుట్టలా మారుతోందని రైల్వే వర్గాలు తెలిపాయి. అప్పుడే ఒక కుర్చీ కూడా విరిగిపోయింది. టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయి. రైల్వే సిబ్బంది రైలును పరిశుభ్రంగా ఉంచుతున్నప్పటికీ ఆ బాధ్యత ప్రయాణికులపై కూడా ఉందని వాల్తేరు డీఆర్ఎం ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)