బొల్లి అంటువ్యాధి కాదు !

Telugu Lo Computer
0


చర్మం మీద సహజంగా ఉండే రంగు పోవడం, తెల్ల మచ్చలు ఏర్పడడాన్నే విటిలిగో లేదా బొల్లి అంటారు. కొందరి విషయంలో శరీరమంతా ఈ తెల్లమచ్చలు వ్యాపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వంద మందిలో ఒకరిని ఈ సమస్య వేధిస్తోంది. భారత్‌లో మాత్రం, అత్యధికంగా ప్రతి వంద మందిలో అయిదు నుంచి ఎనిమిది మందికి ఈ సమస్య ఉంది. ఎక్కువగా ఇరవైలలో ఉన్నప్పుడు బొల్లి మొదలవుతుంది. దానికి అనేక కారణాలు ఉంటాయి. వంశ పారంపర్యంగా కూడా ఇది వస్తుంటుంది. చర్మంలో ఉండే మెలనోసైట్లు అని పిలిచే ప్రత్యేక కణాలు మెలనిన్ ను ఉత్పత్తి చేస్తాయి. మన చర్మం రంగుకు ఈ మెలనినే కారణం. దీని స్థాయిలు తగ్గిపోయినప్పుడు బొల్లి వస్తుంది. దీని వలన చర్మంపై తెల్ల మచ్చలు ఏర్పడతాయి. దీని ప్రభావం ముఖ్యంగా చర్మం, వెంట్రుకల మీద కనిపిస్తుంది. దీనిని కేవలం ఒక అందానికి సంబంధించిన సమస్యగా పరిగణించకూడదు. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీని కారణంగా శరీరంలోని కొన్ని లేదా చాలా ప్రాంతాలలో మెలనోసైట్ల సంఖ్య తగ్గుతుంది. ముఖ్యంగా ఆక్సీకరణ ఒత్తిడి వల్ల మెలనోసైట్లు నాశనం అవడంతో ఈ సమస్య మొదలవుతుంది. ఇది అంటువ్యాధి కాదు. బాధితులను తాకడం ద్వారా ఇది వ్యాప్తి చెందదు. బొల్లిలో చాలా రకాలు ఉంటాయి. వీటిని సెగ్మెంటల్, నాన్ సెగ్మెంటల్‌గా వర్గీకరిస్తారు. కేవలం ఒక్క భాగంలో మాత్రమే ఉంటే దాన్ని సెగ్మెంటల్ అని, అలా కాకుండా చాలాచోట్ల ఉంటే నాన్ సెగ్మెంటల్ అని అంటారు. నాన్ సెగ్మెంటల్ లో, మళ్ళీ అనేక రకాలు ఉంటాయి. శరీరంలో ముందు, వెనుక భాగాలతోపాటు, పెదవులకు కూడా బొల్లి ఉంటుంది (జనరలైజ్డ్) చేతులు, కాళ్ళతోపాటు పెదవులకు బొల్లి ఉంటుంది (ఆక్రో ఫేషియల్) మరొక రకంలో, శరీరంలో చుక్కలు చుక్కలుగా తెల్ల మచ్చలు కనిపిస్తాయి (పంక్టెట్) కొందరిలో కేవలం శ్లేష్మ పొరలో మాత్రమే కనిపించవచ్చు. అంటే, కేవలం నోరు, జననేంద్రియాల వద్ద బొల్లి ఉంటుంది. ఆక్రో ఫేషియల్, జనరలైజ్డ్ రకాలు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. శరీరం మీద కనిపించే తెల్ల మచ్చలను బొల్లి అని అనుకునే ముందు ఇతర కారణాలు ఏమైనా దీని కారణమేమో తెలుసుకోవాలి. ఒక్కోసారి పాత గాయాలు, దీర్ఘ కాలిక దురదతో మొదలుపెట్టి కుష్టు వ్యాధి, కొన్ని రకాల క్యాన్సర్ల వల్ల కూడా ఈ మచ్చలు వస్తుంటాయి. బొల్లి బాధితులకు ఇతర ఆటోఇమ్మ్యూన్ డిజార్డర్‌లు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే, థైరాయిడ్, మధుమేహం, కొంత భాగంలో జుట్టు పోవడం, పర్ణీషియస్ అనీమియా (B12 విటమిన్ లోపం), సొరియాసిస్, మొదలైన సమస్యలు బాధితుల్లో కనిపించొచ్చు. అందుకే వీటికి సంబంధిత లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకొని, తగిన పరీక్షలు చేసుకోవడం మంచిది. బొల్లి రకం, దాని వ్యాప్తిని బట్టి చికిత్స ఆధార పడి ఉంటుంది. మందులతోపాటు, బాధితులకు భరోసా ఇవ్వడం, మానసికంగా ధైర్యాన్ని కలిగించడం కూడా చాలా ముఖ్యం. లేదంటే మానసిక ఒత్తిడి వల్ల రోగి కుంగుబాటులోకి వెళ్ళే అవకాశం ఉంది. చాలా వరకు చికిత్స అనేది మెలనిన్ లోపానికి గల సమస్యపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది బాధితులు దీర్ఘ కాలం చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. పరిస్థితి కొంత మెరుగు అయిన మళ్లీ ఈ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుందని బాధితులకు ముందే తెలియ చేయడం మంచిది. లేదంటే రోగికి సమస్య సరిగా అర్థం అవ్వక, వైద్యుల మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంటుంది. ముఖం, ఛాతి మీద మచ్చలు కొంతవరకు తేలికగానే తగ్గిపోతాయి. కానీ, పెదవులు, అర చేతులు, పాదాల మీద ఉన్న బొల్లి తగ్గడం చాలా కష్టం. చికిత్స పనిచేస్తుంది అని తెలియడానికి కనీసం రెండు మూడు నెలలు వేచి చూడాలి. సాధారణంగా బాధితులకు అల్ట్రావైలెట్ లైట్ ద్వారా చేసే చికిత్సను సిఫార్సు చేస్తుంటారు. కింద పేర్కొన్న మరికొన్ని చికిత్సలను కూడా వైద్యులు సూచిస్తుంటారు.పూర్తిగా తగ్గే అవకాశాలు తక్కువే అయినా, నిరుత్సాహ పడకుండా, దాన్ని అంగీకరించి, సాధారణ జీవితం గడపడం మంచిది.

Post a Comment

0Comments

Post a Comment (0)