బీహార్‌లో హింసాత్మకంగా మారిన రైతుల నిరసన

Telugu Lo Computer
0


ఇంటిలో నిద్రిస్తున్న రైతులపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో పోలీసులు విరుచుకుపడి విచక్షణరహితంగా కొట్టారంటూ స్థానికులు చేపట్టిన నిరసన బీహార్‌లోని బక్సర్‌లో హింసకు దారితీసింది. ఆగ్రహావేశాలకు గురైన నిరసనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. వాటికి నిప్పుపెట్టారు. చౌస పవర్ ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యుత్ కంపెనీ సట్లజ్ జల్ విద్యుత్ నిగమ్ (ఎస్‌జెవిఎన్) సేకరించిన భూముల వ్యవహారంపై గత రెండు నెలలుగా రైతులు నిరసనలు చేస్తున్నారు. కంపెనీ గేటు బయట రైతులు నిరసనలు సాగిస్తున్నారు. దీంతో ప్లాంట్ పనులకు విఘాతం కలుగుతుంది. ఈ క్రమంలో నిరసనలు సాగిస్తున్న రైతులు ఉంటున్న ఇంటిపై మంగళవారం రాత్రి పోలీసులు విరుచుకుపడ్డారు. వారి కుటుంబ సభ్యులపై కూడా దాడులకు దిగారు. గ్రామంలోని ముగ్గురు యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అర్థరాత్రి సమయంలో పోలీసులు జరిపిన దాడులకు ప్రతిగా స్థానికులు బక్సర్ రోడ్లపైకి వచ్చి బుధవారంనాడు ఆందోళనలకు దిగారు. పోలీసులు, వారి వాహనాలపై రాళ్లు రువ్వారు. దీనిపై రైతు నిరసనకారుడు ఒకరు మీడియాతో మాట్లాడుతూ, సరైన పరిహారం ఇవ్వనందునే తాము నిరసనలు చేస్తున్నామని చెప్పాడు. అయితే గత రాత్రి పోలీసులు ఒక రైతు ఇంటిపై దాడి చేసి మహిళలని కూడా చూడకుండా కొట్టారని, నలుగురిని అరెస్టు చేశారని, ఎస్‌జేవీఎన్ కంపెనీ కారణంగానే పోలీసులు తమను వేధిస్తునట్టు తెలిపాడు. ధర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం 2013లో అప్పటి ధరల ప్రకారం ఎస్‌జేవీఎన్ కంపెనీ రైతుల నుంచి భూసేకరణకు ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుతం 2022 సంవత్సరం ధర ప్రకారం చెల్లించాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రైతులు నిరసనలు సాగుస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)