తామేమీ బిచ్చగాళ్లం కాదు !

Telugu Lo Computer
0


కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికణను రద్దు చేయడం వల్ల తుపాకీ సంస్కృతి తగ్గుతుందని బీజేపీ చెబుతూ వచ్చిందని, కానీ వాస్తవంలో కాశ్మీర్ మరింత పతనావస్థకు చేరిందని కేంద్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల్ని కేంద్రం తక్కువ చేసి చూస్తోందని, తామేమీ బిచ్చగాళ్లం కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంస్కృతి పోయిందని, వెంటనే దాన్ని పునరుద్దరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఒమర్ డిమాండ్ చేశారు. అనంత్‌ జిల్లాలో మీడియాతో నేషనల్ కాన్ఫరెన్స్ నేత అయిన ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఎన్నికలు ప్రజా హక్కని, అయితే ఎన్నికలు నిర్వహించాలని కాశ్మీర్ ప్రజలు కేంద్రం ముందు అడుక్కోరని అన్నారు. ఎన్నికలు ఈ ఏడాది నిర్వహించకపోతే పోనీయండి కానీ తామేమీ బిచ్చగాళ్లం కాదని అన్నారు. తమ కోసం ఎన్నికలు పునరుద్ధరించాలని అనుకుంటే మంచిదే కానీ ఎన్నికలు జరిపించాలని వారు కోరుకోనట్లయితే, అలాగే కానీయండంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను పదే పదే గుర్తు చేస్తున్నానని అబ్దుల్లా అన్నారు. ఆస్తులు, ప్రభుత్వ భూముల నుంచి ప్రజలను ఖాళీ చేయించడం గురించి అడిగిన ప్రశ్నకు ఒమర్ అబ్దుల్లా సమాధానమిస్తూ, జమ్మూకాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించకపోవడానికి అదొక కారణమని అన్నారు. గాయాలపై వారు ఉప్పు చల్లితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఆ గాయాల నుంచి వారికి ఉపశమనం కలిగిస్తుందనే విషయం కేంద్ర ప్రభుత్వానికి బాగా తెలుసునని, అందుకే ఎన్నికలు నిర్వహించడం లేదని అన్నారు. ప్రజలను మరింత వేధించాలని బీజేపీ భావిస్తోందని, తగిలిన గాయాలకు తైలం పూయడానికి బదులు గాయాన్ని మరింత తీవ్రతరం చేయాలని అనుకుంటున్నారని అబ్దుల్లా మండిపడ్డారు.

Post a Comment

0Comments

Post a Comment (0)