వృద్ధుడిని కొట్టిన మహిళా కానిస్టేబుళ్లు !

Telugu Lo Computer
0


బీహార్‌లోని కైమూర్ జిల్లాలో 60 ఏళ్ల ఉపాధ్యాయుడిని ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు దారుణంగా కొట్టారు. బాటసారులు తీసిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బర్హులీ గ్రామానికి చెందిన నావల్ కిషోర్ పాండే అనే వ్యక్తిని ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మార్గంమధ్యలో లాఠీలతో కొట్టినట్లు వీడియోలో కనిపించింది. భబువాలోని జై ప్రకాష్ చౌక్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. నవల్ కిషోర్ పాండే తన సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా మహిళా కానిస్టేబుళ్లు అతన్ని ఆగమని చెప్పారు. అయితే ఆ వ్యక్తి ఆగలేదు. ఏదో మాట్లాడుకుంటూ ముందుకు కదిలాడు. కానీ అతను తమను దుర్భాషలాడాడని కానిస్టేబుళ్లు భావించి ఇష్టానుసారం కొట్టారు. కానిస్టేబుళ్లు అతని సైకిల్‌ను లాగి, కారణం లేకుండా కొట్టడం ప్రారంభించారు. వీడియోలో వృద్ధుడు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినట్లు కనిపించింది. అయితే అతని చేతులపై అనేక దెబ్బలు చూడవచ్చు. తనను విడిచిపెట్టమని అతను వారిని వేడుకున్నాడు. కానీ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు అతనిని కొట్టడం, అతనిపై కేకలు వేయడం కొనసాగించారు. "నేను డిపిఎస్ పర్మల్‌పూర్‌లో ఇంగ్లీష్ టీచర్‌ని. నేను సైకిల్‌తో రోడ్డు దాటుతుండగా ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లు నన్ను అడ్డుకున్నారు. వారు నన్ను ఆపారు. కానీ నేను పట్టించుకోకుండా ముందుకు కదిలాను" అని అతను చెప్పాడు. "ఒక కానిస్టేబుల్ సైకిల్ ముందుకి వచ్చి, మరొకరు నా సైకిల్ వెనుక నిలబడి లాఠీచార్జ్ చేశారు. నేను వారిని ఆపమని అడిగాను. కానీ వారు వినలేదు. నాపై 20 రౌండ్లకు పైగా లాఠీల వర్షం కురిపించారు. ఆ తర్వాత ఓ వ్యక్తి జోక్యం చేసుకోవడంతో ఆగిపోయారు. నేను పోలీస్ స్టేషన్‌లో ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. వారు కొట్టిన కారణంగా నా కాళ్ళు, చేతులు వాచిపోయాయి. నాకు న్యాయం కావాలి" అని వృద్ధ ఉపాధ్యాయుడు చెప్పారు. ఈ సంఘటన తర్వాత కైమూర్ పోలీసు సూపరింటెండెంట్ లలిత్ మోహన్ శర్మ మాట్లాడుతూ తాను వీడియో క్లిప్‌ను చూశానని, ఈ విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు. 24 గంటల్లోగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) నుంచి నివేదిక కోరారు. ''ఈ విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే ఈ విషయంపై విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఆ ప్రాంత డీఎస్పీని కోరాం. ప్రాథమిక విచారణను పరిశీలిస్తే.. నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటాం'' అని ఎస్పీ తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)