తీవ్ర వాయుగుండంగా మారిన 'మాండౌస్‌'

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండౌస్‌ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఇది పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటింది. ఆ తర్వాత క్రమంగా వాయువ్య దిశలో పయనిస్తున్న మాండౌస్‌.. శనివారం మధ్యాహ్నానికి మరింతగా బలహీనపడి వాయుగుండగా మారనుందని వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో తమిళనాడులోని చెన్నై, చెంగల్పట్టు సహా పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో చాలా చోట్ల వందలాది వృక్షాలు నేలకూలాయి. చెన్నైలో దాదాపు 200 చెట్లు కూలినట్లు అధికారులు తెలిపారు. ముందుగా అప్రమత్తమై భారీ హోర్డింగ్‌లకు రక్షణ ఏర్పాట్లు చేయడంతో పెను విధ్వంసం తప్పిందన్నారు. మాండౌస్‌ కారణంగా చెన్నై, చెంగల్పట్టు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు  కురుస్తున్నాయి. చెన్నైలో నిన్న 115 మి.మీల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. చెన్నైలోని ఎగ్మూర్‌ ప్రాంతంలో భారీ వృక్షం కూలి పక్కనే ఉన్న పెట్రోల్‌ బంక్‌పై పడింది. దీంతో బంకు ధ్వంసమైంది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్ అధికారులు సూచించారు. మాండౌస్‌ ప్రభావంతో తీరంలో అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి.తుపాను నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. పది జిల్లాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచింది. దాదాపు 5వేలకు పైగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. మాండౌస్‌ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)