జడ్జీల నియామకంపై విమర్శలు గుప్పించిన ఉప రాష్ట్రపతి

Telugu Lo Computer
0


సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకం విషయమై ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకి మధ్య చాలా కాలంగా విబేధాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలోని వారు బహిరంగంగా కొలీజియం వ్యవస్థను తప్పు పడుతుండగా, కొలీజియం వ్యవస్థే సరైందంటూ సుప్రీం పలుమార్లు సమర్ధించుకుంది. ఇదే విషయమై తాజాగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‭కర్ స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. అయితే ఆయన కొలీజియం పేరు ప్రస్తావించలేదు కానీ, నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్‭మెంట్స్ కమిషన్‭ ను ప్రస్తావస్తూ సుప్రీంకోర్టు దీనిని రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఈ వ్యాఖ్యలు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పాల్గొన్న సమావేశంలోనే చేయడం గమనార్హం. పార్లమెంట్ చేసిన జ్యుడీషియల్ అపాయింట్‭మెంట్స్ కమిషన్‭ను రద్దు చేయడం అంటే ప్రజల నిర్ణయాన్ని రద్దు చేయడమేనని జగదీప్ ధన్‭కర్ అన్నారు. ''పార్లమెంట్ ఒక చట్టం చేసిందంటే అది ప్రజల ఆకాంక్ష మేరకే ఉండి ఉంటుంది. అది ప్రజల శక్తి. అలాంటి దానిని సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఇలాంటి ఉదాహరణ ప్రపంచానికి తెలియదు'' అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగంలోని నిబంధనలను ఆయన ఊటంకిస్తూ, చట్టం పరిధిలో ఏదైనా ముఖ్యమైన ప్రశ్న తలెత్తినప్పుడు కోర్టులు చొరవ తీసుకుని ప్రశ్నించవచ్చని అన్న ఆయన ఏకంగా నిబంధననే రద్దు చేయమని ఎక్కడా చెప్పలేదని విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)