బఫెలో సిటీలో సూర్యుడు కనిపించాడు !

Telugu Lo Computer
0


అమెరికాలో గత కొద్ది రోజులుగా మంచు తుఫాన్‌కు అల్లాడిపోయిన న్యూయార్క్‌ రాష్ట్రంలోని బఫెలో సిటీలో ఎట్టకేలకు సూర్యరశ్మి కనిపించింది. గురువారం ఉదయం సూర్యుడి రాకతో కాసేపు వాతావరణం వెచ్చగా మారడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో ప్రజల క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి నేషనల్‌ గార్డ్‌ అధికారులు ఇంటింటికి వెళ్తున్నారు. విద్యుత్‌ సౌకర్యం పోయిన ఇళ్లకి వెళ్లి వారు ఎలా ఉన్నారో వాకబు చేస్తున్నారు. తీవ్రమైన మంచు కురుస్తున్నప్పుడు కరెంట్‌ పోయిన సమయంలో ఆక్సిజన్‌ వెంటిలేషన్‌ మీద ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అత్యవసర సహాయం అందక కొందరు మృతి చెందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. రహదారులపై కొన్ని అడుగుల మేర పేరుకుపోయిన మంచు కరిగితే ఇంకా ఎన్ని మృతదేహాలు బయటకు వస్తాయోనన్న ఆందోళనైతే నెలకొంది. బఫెలో నగరంలో రాకపోకల్ని పునరుద్ధరించారు. భారీ యంత్రాల సాయంతో రహదారులపై ముంచెత్తిన మంచుని తొలగించే పని యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని బఫెలో నగర మేయర్‌ బైరన్‌ బ్రౌన్‌ వెల్లించారు. అత్యవసరమైతే తప్ప ఇంకా ఇంటి నుంచి బయటకు రావొద్దని ఆయన నగర ప్రజలను హెచ్చరించారు. అమెరికాలోని మరికొన్ని రాష్ట్రాల్లో మంచు ముంచేయడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం మైనస్‌ డిగ్రీలకు పడిపోవడంతో నీటి పైపులు పగిలిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజులుగా కుదిపేసిన మంచు తుఫాన్‌ కాస్త శాంతించినట్టే కనిపిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)