పొగమంచు కారణంగా 30 వాహనాలు ధ్వంసం !

Telugu Lo Computer
0


హర్యానాలోని కర్నాల్ జాతీయ రహదారిపై భారీగా పొగమంచు కారణంగా మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 30 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇందులో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదాల కారణంగా హైవేపై ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కుటేల్ ఓవర్ బ్రిడ్జి దగ్గర తొలి ప్రమాదం జరిగింది. ఇందులో 15, 16 వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ట్రక్కులు, కార్లు, ట్రాక్టర్ ట్రాలీలు, బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లుగా తెలుస్తున్నది. ప్రమాదం జరిగిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఈ ప్రమాదంలో రెండు హర్యానా రోడ్‌వేస్ బస్సులు కూడా ధ్వంసమయ్యాయి. వీటిలో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ఇది కాకుండా, హర్యానా రోడ్‌వేస్ బస్సు కింద డస్టర్ కారు నలిగిపోయింది. ఇందులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా హైవేపై అక్కడక్కడా వాహనాలు బొమ్మల్లా పడిపోయి ఉన్నాయి. రెండో ప్రమాదం మధుబన్ సమీపంలో జరిగింది. 10-12 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఇక్కడ కూడా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీప దవాఖానకు తరలించి క్షతగాత్రుల బంధువులకు సమాచారమిచ్చారు. మూడో ప్రమాదం కర్నాల్ టోల్ సమీపంలో జరిగింది. పొగమంచు కారణంగా హైవేపై ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. 30 వాహనాలు ప్రమాదానికి గురవగా.. 12 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)