అమెరికాలో ఆయాల కొరత !

Telugu Lo Computer
0


అమెరికా ప్రజలను ఇప్పుడు ఆయాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నఫళంగా 80 వేల బేబీ సిట్టర్ల అవసరమని అంచనా. మన దగ్గర పుట్టిన పిల్లలను అమ్మమ్మో, నానమ్మో చూసుకుంటారు. కానీ, అమెరికాలో అలాంటి పరిస్థితి లేదు. అక్కడ సగటు మధ్యతరగతి ప్రజలు బతకాలంటే భార్యాభర్తలిద్దరూ పని చేయాల్సిందే. అయితే కరోనా తర్వాత పరిస్థితులు మారిపోవడంతో మహిళలు పిల్లల సంరక్షణ కోసం అక్కడి తల్లులు ఉద్యోగాలు మానేయాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున మధ్యతరగతి మహిళలు ఇంటికే పరిమితమై పిల్లలను చూసుకుంటున్నారు. కరోనాకు ముందు ఆయాలు తక్కువ ధరకే అందుబాటులో ఉండేవారు. ఇప్పుడు ఆయా సేవలకు డిమాండ్ పెరగడంతో పాటు వారి వేతనాలు కూడా భారీగా పెరిగాయి. ఓ సగటు మహిళ ఉద్యోగం చేసి ఎంత సంపాదిస్తుందో అదే స్థాయిలో ఆయాల వేతనం పెరిగింది. దీంతో ఉద్యోగం చేస్తే ఎంత? చేయకపోతే ఎంత? అనే భావన మహిళల్లో నెలకొంది. చైల్డ్ కేర్ సెంటర్లు అమెరికా అవసరాలను తీర్చలేకపోతున్నాయి. కొన్ని సంరక్షణ కేంద్రాలు నాణ్యమైన సేవలను ధనికులు, ఉన్నత వర్గాల వారికే అందిస్తున్నాయి. ఇవి ఏటికేడు 15 నుంచి 20 శాతం అధిక ఆదాయాన్ని అర్జించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఓ రిపోర్టు ప్రకారం అమెరికాలో 12 మిలియన్ల మంది పిల్లలకు ఆయాల సేవల అవసరం. వర్కింగ్ కల్చర్ ఉన్న అమెరికాలో ఇప్పుడు ఈ రంగం ధనాన్ని అర్జించి పెట్టే సాధనంగా గుర్తింపు పొందింది. దానికి తగ్గట్టు ఆయా సంరక్షణ కేంద్రాల్లో పెట్టుబడులు కూడా భారీగా పెరుగుతున్నాయి. అలాగే ఆయాల జీతం కూడా ఊహించని విధంగా పెరిగింది. మధ్యతరగతి వారికి సేవలందించే కమ్యూనిటీ సెంటర్లలో గంటకు రూ. 1200 ఇస్తుండగా, పెట్టుబడులు వచ్చిన కంపెనీల్లో ఇంతకంటే ఎక్కువే ఇస్తున్నారు. ఈ కారణంగా మహిళలు ఉద్యోగాలు మానేయడంతో ఆ దేశంలో పెద్ద సంక్షోభం వచ్చింది. ఈ విషయం అధ్యక్షుడు బైడెన్ వరకు వెళ్లగా, కుటుంబ ఆదాయం ఆధారంగా పిల్లల సంరక్షణ ఖర్చు చెల్లించేందుకు ఆయన బిల్డ్ బ్యాక్ బెటర్ అనే బిల్లును తీసుకువచ్చారు. కానీ, పిల్లల సంరక్షణ సంస్థలకు బలమైన లాబీలు ఉండడంతో బిల్లు చట్టంగా మారలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)