ఎయిరిండియా గ్రూమింగ్‌ మార్గదర్శకాలు !

Telugu Lo Computer
0


ఎయిర్ ఇండియా క్యాబిన్ అటెండెంట్ల కోసం గ్రూమింగ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నియమావళిలో మహిళా సిబ్బంది బొట్టు బిళ్ల సైజు నుంచి ధరించే బ్యాంగిల్స్ సంఖ్య వరకు అన్నింటిని ఫిక్స్ చేశారు. జుట్టు ఎంత పెంచుకోవాలో మగ సిబ్బంది ఎలాంటి హెయిర్‌ స్టయిల్‌ పాటించాలో కూడా నియమావళిలో పొందుపరిచారు. నెల రోజుల క్రితమే ఈ జాబితాను జారీ చేసినట్లుగా సమాచారం. యూనిఫాం, పర్సనల్‌ గ్రూమింగ్‌ ప్రమాణాల్లో తీసుకొచ్చిన మార్పులపై భిన్న స్పందన వినిపిస్తున్నది. ఎయిరిండియాను టాటా సంస్థ స్వాధీనం చేసుకున్న అనంతరం క్యాబిన్‌ క్రూ, ఎయిర్‌ హోస్టెస్‌లకు వస్త్రధారణ ప్రమాణాలపై కొన్ని మార్గదర్శకాలు, ఆపరేటింగ్‌ విధానాల నిమిత్తం ఆదేశాలు జారీ చేసింది. దీని తర్వాత ఫ్లైట్‌ అటెండెంట్స్‌ కోసం ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల కంటే మరింత కఠిన రూల్స్‌ తీసుకొచ్చింది. మగ క్యాబిన్‌ క్రూ సభ్యులు తప్పనిసరిగా హెయిర్‌ జెల్‌ వాడాలి. బట్టతల ఉన్నవారు తల రూపాన్ని మార్చుకోవాలి. బట్ట తల ఉన్నట్లు తెలియకుండా నున్నగా షేవ్‌ చేసుకోవాలి. ప్రతి రోజు నీట్‌గా షేవింగ్‌ చేసుకోవాలి. క్రూ కట్‌ అనుమతించరని నిబంధనల్లో పేర్కొన్నారు. ఆడ క్యాబిన్‌ సిబ్బంది ముత్యాల చెవి పోగులు ధరించకూడదు. డిజైన్‌ లేని బంగారం లేదా డైమండ్‌ చెవి పోగులు మాత్రమే ధరించాలి. ఎక్కువ ముడులు వేసే కేశాలంకరణ చేసుకోరాదు. నాలుగు బ్లాక్‌ బాబీ పిన్‌లను మాత్రమే ఉపయోగించాలి. ఐషాడో, లిప్‌స్టిక్‌, నెయిల్‌ పెయింట్‌, హెయిర్‌ షేడ్‌ కార్డ్‌లకు కట్టుబడి ఉండాలి. వ్యక్తిగత షేడ్స్‌ అనుమతించరు. డిజైన్‌, రాళ్లు లేని కంకణం ధరించేందుకు అనుమతిస్తారని పేర్కొన్నారు. తల వెంట్రుకలకు ఫ్యాషన్‌ రంగులు, గోరింటను వేసుకోవడాన్ని అనుమతించరు. చెదిరిపోయిన జుట్టు లేదా పొడవాటి మ్యాట్ జుట్టుతో కేశాలంకరణ ఉండకూడదు. మణికట్టు, మెడ, చీలమండపై నలుపు లేదా మతపరమైన దారాలు కట్టుకోవడాన్ని కూడా నిషేధించారు. బొట్టు బిళ్ల సైజు 0.5 సెం.మీ కంటే ఎక్కువగా ఉండకూడదు.

Post a Comment

0Comments

Post a Comment (0)