యుద్ధానికి సిద్ధంకండి !

Telugu Lo Computer
0


మూడోసారి మిలటరీ కమిషన్ అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన ప్రెసిడెంట్ జిన్ పింగ్.. సీపీసీకి వ్యూహాత్మక మద్దతునిచ్చే సీఎంసీలోని జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్‌ను తాజాగా పరిశీలించారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోని 20 లక్షల మంది సైన్యాన్ని ఉద్దేశించి భవిష్యత్ లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. 2027 నాటికి ప్రపంచస్థాయి సైనిక శక్తిగా ఎదగాలని డ్రాగన్ ఆర్మీకి సూచించారు. ఈ శతాబ్దంలోనే ఎప్పుడూ చూడని మార్పులు ప్రపంచంలో సంభవిస్తున్నాయని.. చైనా జాతీయ భద్రతలో అస్థిరత నెలకొందని చెప్పారు. అందువల్ల.. సైనిక లక్ష్యాలు కూడా కఠినంగా మారాయని చెప్పుకొచ్చారు. అందువల్ల.. పోరాటాలకు సిద్ధంగా ఉండేందుకు.. అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాలను గెలిచేందుకు అవసరమైన సామర్థ్యాన్ని, యుద్ధ సన్నద్ధతను పెంచుకునేందుకు పూర్తి శక్తియుక్తులను ధారపోయాలన్నారు జిన్ పింగ్. 20వ సీపీసీ నేషనల్ కాంగ్రెస్ మార్గదర్శక సూత్రాలను.. అధ్యయనం చేయడంతో పాటు ప్రచారం చేయాలని.. అమలు చేయాలని చెప్పారు. సైన్యాన్ని మరింత ఆధునీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సాయుధ బలగాలను ఆదేశించారు.  చైనాలో వేగవంతమైన సైనిక అభివృద్ధి, టెక్నాలజీలో స్వయం సమృద్ధి, విదేశాల్లో చైనా ప్రయోజనాలను రక్షించడం కోసం పిలుపునిచ్చారు జిన్ పింగ్. ఇప్పుడదే జిన్ పింగ్ నుంచి ఈ హెచ్చరికలు వచ్చాయి. కొన్నిరోజులుగా కాస్త ప్రశాంతంగా ఉన్న చైనా, తైవాన్ మధ్య.. జిన్ పింగ్ వ్యాఖ్యలతో మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. అమెరికా చట్టసభల స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన తర్వాత రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెలోసీ పర్యటనను.. తమ దేశ సార్వభౌమాధికారానికి సవాలుగా భావించింది జిన్ పింగ్ సర్కార్. ఆర్మీతో పెద్ద ఎత్తున బలప్రదర్శన చేయడం, సరిహద్దుల్లో ఆర్మీ డ్రిల్స్, తైవాన్‌పై బాలిస్టిక్ మిస్సైళ్లు పేల్చడంతో.. డ్రాగన్ ప్రతీకారం తీర్చుకుంది. తర్వాత కూడా చైనా భారీగా యుద్ధనౌకలు మోహరించడం, తైవాన్‌కు అమెరికా అండగా నిలబడటం లాంటి పరిణామాలు యుద్ధం తప్పదన్న సంకేతాలిచ్చాయి. కొన్ని వారాల పాటు సాగిన ఉద్రిక్తతలు తర్వాత చల్లారాయి. అయినప్పటికీ.. తైవాన్‌ను ఆక్రమించుకోవాలన్న జిన్‌పింగ్ ఆలోచనలో ఎలాంటి మార్పూ రాలేదని.. తాజా వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి.సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు కూడా జిన్ పింగ్ తైవాన్ ప్రస్తావన తీసుకొచ్చారు. తైవాన్.. చైనా నుంచి విడిపోయిన ప్రావిన్సేనని.. ఎప్పటికైనా.. అది చైనాలో కలిసిపోతుందని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీ 20వ కాంగ్రెస్‌లోనూ తైవాన్‌కు ఇదే రకమైన హెచ్చరికలు చేశారు జిన్‌పింగ్. చైనా పునరేకీకరణే తమ లక్ష్యమని.. దేశ ప్రజల ఇష్టానుసారం అది జరుగుతుందని, అవసరమైతే బలప్రయోగానికైనా సిద్ధమని ప్రకటించారు. ఇది జరిగిన నెలరోజుల్లోనే మరోసారి జిన్‌పింగ్ ఆర్మీ సన్నద్ధంగా ఉండాలని ఆదేశించడం చూస్తుంటే.. ఎవ్వరూ ఊహించని విధంగా ఏ క్షణమైనా చైనా.. తైవాన్‌పై యుద్ధానికి దిగొచ్చన్న అంచనాలు కనిపిస్తున్నాయి. అటు తైవాన్ కూడా చైనా విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో భారీగా బలగాలు, యుద్ధనౌకలు, విమానాలు మోహరించి ఉంచింది. అమెరికా సాయం తీసుకుంటూనే ప్రపంచ దేశాల నుంచి మద్దతు పొందే ప్రయత్నం చేస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత.. చైనాలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగేందుకు జిన్ పింగ్ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం.. ఆయన మూడు కీలక పదవులను నిర్వహిస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో సెంట్రల్ కమిటీకి ఎన్నికైన తర్వాత.. జిన్ పింగ్ మూడోసారి చైనా అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. దీంతో పాటు సీపీసీ జనరల్ సెక్రటరీగానూ ఎన్నికయ్యారు. ఇక.. సెంట్రల్ మిలటరీ కమిషన్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఇంచార్జ్‌గానూ ఆయనే ఉన్నారు. పార్టీ అధినేతగా, అధ్యక్షుడిగా, సర్వ సైన్యాధ్యక్షుడిగా.. మూడు అత్యంత శక్తిమంతమైన పదవులకు జిన్‌పింగ్ నాయకత్వం వహిస్తున్నారు. మూడోసారీ చైనా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టాక తొలిసారి 20 లక్షల మంది సైన్యాన్ని ఉద్దేశించి జిన్ పింగ్ ప్రసంగించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)