పలివెలలో తెరాస-భాజపా బాహాబాహీ !

Telugu Lo Computer
0


తెలంగాణలోని మునుగోడు మండలం పలివెలలో భాజపా, తెరాస కార్యకర్తలు పరస్పరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. పలివెలలో ఓ వైపు భాజపా, మరోవైపు తెరాస ప్రచారం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పిడిగుద్దులతో ఇరు పార్టీల శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నారు. భాజపా ప్రచార కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పైనా రాళ్ల దాడి జరిగింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇంత ఉద్రిక్తత చోటు చేసుకున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఈటల మండిపడ్డారు. ''నేను, నా సతీమణి.. ప్రజలతో కలిసి భోజనం చేసే కార్యక్రమానికి వచ్చాం. మహిళలు, గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చారు. అదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు జిల్లా పరిషత్‌ ఛైర్మన్లు కలిసి ప్రణాళిక ప్రకారం వాళ్ల వర్గాలతో కలిసి రాళ్ల దాడికి దిగారు. జెండాల ముసుగులో రాళ్లు, కర్రలు తీసుకొచ్చారు. దాడులు చేయడం మాకు చేతకాక కాదు.. మేం సంయమనం పాటించాం. దాడులు చేయడం, కొట్లాటలకు దిగడం, భౌతిక దాడులకు మేం విరుద్ధం. మేం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం. మేం గెలవబోతున్నామనే నమ్మకంతో సహనంతో ఉన్నాం. ఇవాళ వాళ్లు అసహనంతో ఉన్నారు కాబట్టే దాడులకు దిగారు. నా గన్‌మెన్లు, పీఏ గాయపడ్డారు. 10 నుంచి 15 కార్లు ధ్వంసం చేశారు. ఇలాంటి చిల్లర వేషాలు గతంలో చాలా చూశాం. ప్రజాక్షేత్రంలో ఇలాంటి దాడులకు పాల్పడితే భయపడేది లేదు. మునుగోడు ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఉపఎన్నికలో కచ్చితంగా ఇక్కడి ప్రజలు సరైన తీర్పు ఇస్తారు. రాబోయే కాలంలో ఏం చేయాలో అది చేస్తాం'' అని ఈటల అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)