రైలులో నమాజ్ పై విచారణకు యోగి సర్కార్ ఆదేశం

Telugu Lo Computer
0


రైలులో ముస్లింలు నమాజ్ చేస్తున్న వీడియో దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. దీనిపై కొంత మంది సానుకూలంగా ఉండగా, మరికొంత మంది ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే దీప్లాన్ భారతి షేర్ చేసిన ఈ వీడియోపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా రైలులో నమాజ్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదంపై దీప్లాన్ భారతి రైల్వేకు, యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యాగ్రహ ఎక్స్‌ప్రెస్ ఖుషీనగర్ ఖద్దా రైల్వే స్టేషన్ లో ఆగిన సమయంలో నలుగురు ముస్లింలు ట్రైన్ స్లీపర్ కోచ్ లో ప్రయాణికులు నడిచే స్థలంలో నమాజ్ చేశారు. ప్రయాణికులు కోచ్ లోకి వెళ్లకుండా, కోచ్ నుంచి బయటకు రాకుండా ఇద్దరు వ్యక్తుల అడ్డుకోవడం ఈ వీడియోలో కనిపిస్తుంది. దీంతో నమాజ్ అయిపోయేదాకా ప్రయాణికులు కోచ్ లోకి వెళ్లలేకపోయారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై యూపీ సర్కార్ విచారణకు ఆదేశించింది. రాష్ట్ర పోలీసులతో పాటు రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటివి ప్రజా జీవితానికి ఆటంకం కలిగిస్తుందని పలు సంస్థలతో పాటు బీజేపీ పార్టీ ఆరోపిస్తోంది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ప్రభుత్వాలు కక్ష సాధిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో హర్యానాలో ఇలాగే ముస్లింలు బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ చేయడం వివాదాన్ని రాజేసింది. హిందూ సంస్థలు వారికి వ్యతిరేకంగా జై శ్రీరామ్ నినాదాలు చేశారు. ఇది ఇరువర్గాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. జూలై నెలలో ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలోని లూలూ మాల్ లో కొంతమంది ప్రార్థనలు చేయడం.. ఈ వీడియో వైరల్ కావడం జరిగింది. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా ఎవరు ప్రయత్నించినా.. కఠినంగా చర్యలు తీసుకుంటామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ముందస్తు అనుమతులు లేకుండా రాష్ట్రంలో ఎలాంటి మతపరమైన ఊరేగింపులకు, లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదని ఈ ఏడాది ప్రారంభంలో సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు చేయడాన్ని కూడా నిషేధించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)