ఒక్కటి కానున్న ఆర్జేడీ, జేడీయూ ?

Telugu Lo Computer
0


బీహార్‌లో కొత్త రాజకీయ ముఖచిత్రం ఆవిష్కృతం కానున్నది. 28 ఏండ్ల క్రితం నాటి రాజకీయం తిరిగి తెరపైకి రానున్నది. ఇన్నాళ్లు ఎడమొగం పెడమొగంగా ఉన్న రాజకీయ అగ్రగణ్యులు ఇప్పుడు చేతులు కలుపుతున్నారు. దీంతో బీహార్‌లో రాజకీయం కొత్త మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే, బీహార్‌లో బీజేపీకి గడ్డు రోజులు తప్పవని చెప్పవచ్చు. తొమ్మిదేండ్ల కాలంలో బీహార్ రాజకీయ చిత్రం చాలాసార్లు మారిపోయింది. ఎన్నికల్లో కలిసి పోటీ చేసే పార్టీలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కలిసి మనుగడ సాగించలేకపోయాయి. ఎవరు ఎవరికి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేస్తారో, ప్రభుత్వం ఏర్పడేందుకు ఎవరితో కలిసి నడుస్తారో అన్నది ఆలోచనకు కూడా అందదు. అయితే ఈసారి బిహార్ రాజకీయాలలో చాలా మార్కులు చోటు చేసుకోనున్నాయి. గత నెల క్రితం వరకు బద్ధ శత్రువులుగా ఉన్న ఆర్జేడీ, జేడీయూలు చేతులు కలిపి బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాయి. రానున్న రోజుల్లో ఈ మైత్రిని మరింత దృఢంగా చేసేందుకు రెండు పార్టీలు కలిసిపోయి.. పాత జనతాదళ్‌ను తిరిగి ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు చర్చలు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో రెండు పార్టీలు ఒక్కటయ్యే అవకాశం ఉన్నది. బీహార్‌ రాజకీయాలను శాసించిన లాలూ ప్రసాద్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), నితీష్‌ కుమార్‌ ఆధ్వర్యంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఒకటి కానున్నాయి. ఇదే జరిగితే, బిహార్ కమాండ్ తేజస్వి యాదవ్ చేతుల్లోకి వెళ్తుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మారనున్నారు. ముఖ్యమంత్రి పదవికి నితీష్‌ రాజీనామా చేసి ఆ పదవిలో తేజస్విని కూర్చుండబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో పార్టీ గుర్తు, జెండా మార్పుపై కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయం బీహార్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)