మన దేశ జనాభా దృష్ట్యా ఈ వృద్ధి రేటు సరిపోదు

Telugu Lo Computer
0


దేశంలో రోజురోజుకీ పెరుగుతోన్న ధరలపై నిన్న రాజ్యసభలో చర్చ జరగగా, ప్రస్తుతం ప్రపంచమంతటా ఈ సమస్య ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్‌లోనే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని పేర్కొంది. దీనిపై భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేశ వృద్ధి రేటు కొన్ని దేశాల కన్నా అధికంగానే ఉన్నప్పటికీ మన దేశ జనాభా దృష్ట్యా అది మరింత ఎక్కువగా ఉండాలని ఆయన చెప్పారు. భారత వృద్ధిరేటు 7 శాతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని రఘురామ్ రాజన్ గుర్తు చేశారు. అయితే, మన దేశంలోని యువతకు కావాల్సిన ఉద్యోగాలతో పోల్చితే అది సరిపోదని తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్‌, అందుకు తగ్గ ఉద్యోగ కల్పన అనేవి ఆర్థిక వ్యవస్థకు కీలకమని చెప్పారు. వృద్ధిరేటు ఉన్నా ఉత్పాదక సామర్థ్యం తక్కువగా ఉందని ఆయన తెలిపారు. ఉద్యోగాల కల్పనలేని మన దేశ వృద్ధిరేటు గురించి కేంద్ర ప్రభుత్వం చెబుతోందని ఆయన విమర్శించారు. ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాల కల్పన అనేది అతి ముఖ్యమైనదని చెప్పారు. ప్రతి ఒక్కరికి సాఫ్ట్‌వేర్ ప్రొగ్రామర్ లేదా కన్సల్టెంటు ఉద్యోగాలు కావాల్సిన అవసరం లేదని, ఏ ఇతర ఉద్యోగమైనా ఉంటే చాలని అన్నారు. ఉద్యోగాలు సంపాదించడానికి షార్ట్‌కట్లు ఏవీ లేవని, నైపుణ్యాలతో కూడిన విద్యను అందించాలని ఆయన చెప్పారు. దేశంలో పెరిగిన ద్రవ్యోల్బణానికి కరోనా, ఉక్రెయిన్-రష్యా యుద్ధమే కారణమంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటోందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎప్పటికీ ప్రశంసిస్తూ ఉండేవారు చెబుతున్నవే సరైనవని కేంద్రం భావిస్తోందని ఎద్దేవా చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)