ఆయనే నా స్టార్ట్‌-అప్‌ హీరో !

Telugu Lo Computer
0


ముంబయి: ఆ వ్యక్తి పేరు పరమ్‌జిత్ సింగ్. 'ఐ లవ్‌యూ రస్నా' అంటూ ఆకట్టుకున్న రస్నా పానీయానికున్న ఏకైక పంపిణీదారు. అలా సాగిపోతున్న జీవితంలో 1984 అల్లర్లు పెద్ద కుదుపు. దాంతో జీవితంలో అన్నీ కోల్పోయారు. తర్వాత ట్యాక్సీ నడుపుతూ మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఓ గాడినపడుతున్నా అనుకునేలోపు రోడ్డు ప్రమాదంతో చావు అంచులవరకు వెళ్లారు. దాంతో 13 రోజుల పాటు కోమాలోనే ఉండిపోయారు. తీవ్ర గాయాలపాలైన ఆయన్ను గుండెపోటు కూడా ఇబ్బంది పెట్టింది. విధి ఇన్ని రకాలుగా ఆడుకున్నా తన ప్రయాణం మాత్రం ఆపలేదు. తన పొట్టనింపుకునేందుకు ఇప్పుడు ఆటో నడుపుతున్నారు. పరమ్‌జిత్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిడొడుకులను బెటర్ ఇండియా కథనం వివరించింది. ఆయన ముందుకు సాగుతోన్న తీరుకు హ్యాట్సాప్‌ చెప్పింది. ఈ విషయం ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా దృష్టికి చేరింది. పరమ్‌జిత్‌ గురించి చదివిన ఆనంద్‌.. ఆయన తన స్టార్ట్‌-అప్‌ అంటూ కొనియాడారు. 'ఆయన నా స్టార్ట్‌- అప్ హీరో. ఆయనలా ఉండాలంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం కావాలి. ఆయన జీవితాన్ని పునఃప్రారంభించారు. కొత్తగా ఆవిష్కరించారు. అలా ఒక్కసారి కాదు' అంటూ ట్విటర్ వేదికగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పరమ్‌జిత్‌ సింగ్ తండ్రి ఒక సివిల్‌ సర్వెంట్‌. కానీ సింగ్ వ్యాపారరంగంలో ఎదగాలని నిర్ణయించుకున్నారు. రస్నా బ్రాండ్‌కు ఏకైక పంపిణీదారుగా మారారు. అందుకోసం లజపత్‌ నగర్‌లో పెద్ద గౌడౌన్‌ నిర్వహించారు. దిల్లీ చట్టుపక్కల ప్రాంతంలో ఏడెనిమిది ఆటోలను తిప్పుతూ రస్నాను పంపిణీ చేసేవారు. అయితే 1984 అల్లర్ల ఘటనతో తన వ్యాపారం, డీలర్‌షిప్‌ను కోల్పోయారు. ఆ తర్వాత ఆహార సంస్థల్లో పనిచేసినప్పటికీ వాటిలో కుదురుకోలేక.. ట్యాక్సీ నడపడం ప్రారంభించారు. రోడ్డు ప్రమాదం మరోసారి వెనక్కి తోసినా.. ఇప్పుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ కథ విన్న నెటిజన్లు పరమ్‌జిత్‌పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన ఎందరికో స్ఫూర్తి అంటూ స్పందిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)