'దోసె కింగ్‌'గా తెరకెక్కనున్న జీవజ్యోతి కథ !

Telugu Lo Computer
0


తమిళనాడు లోని 'శరవణ భవన్‌' పి.రాజగోపాల్‌ 'దోసె కింగ్‌' గా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించాడు. శరవణ భవన్‌లో వేలాది ఉద్యోగులకు రకరకాల అలవెన్సులు ఇస్తూ కన్నబిడ్డల్లా చూసుకుంటూ దేవుడయ్యాడు. అతని మాటకు ఎదురు లేదు. 1979 నుంచీ శరవణన్ హోటళ్లు అంటేనే ఓ ట్రెండ్. శుచి, శుభ్రత, నాణ్యత. తమిళనాడులోనే కాదు, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లోనూ విస్తరించాయి. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా 22 దేశాల్లో శరవణభవన్‌కు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. రాజగోపాల్‌ను చెన్నై వచ్చిన కొత్తల్లో ఒక జ్యోతిష్యుడు సలహా మేరకు హోటల్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఏదైనా 'అగ్ని'తో ముడిపడిన వ్యాపారం పెట్టమని చెప్పడంతో రాజగోపాల్‌ 'శరవణ భవన్‌' రెస్టారెంట్‌ పెట్టి, సక్సెస్‌ అయ్యాడు. దేశ విదేశాల్లో తన హోటల్‌ సామ్రాజ్యాన్ని విస్తరించి 30 వేల కోట్ల సంపదకు ఎగబాకాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది. అగ్నితో సక్సెస్‌ అయిన రాజగోపాల్‌ 'కామాగ్ని'తో వచ్చిన కీర్తి ప్రతిష్టలన్నింటినీ కాల్చేసుకున్నాడు. మొదట్లో హోటళ్లలో టేబుళ్లు క్లీన్ చేసి, కిరాణా షాపుల్లో పనిచేసిన రాజగోపాల్ తరువాత ఎంత సంపాదించాడో తనకే లెక్క తెలియదు. తన దగ్గరే రామస్వామి అనే వ్యక్తి తన హోటళ్లలోనే అసిస్టెంట్ మేనేజర్‌గా చేసేవాడు. ఆయనకు జీవజ్యోతి అనే కూతురు ఉంది. 1999 ప్రాంతంలో ఆమె 12వ తరగతి చదువుతోంది. ఓరోజు జ్యోతిష్కుడు ఆమెను చూసి ఈమెను పెళ్లి చేసుకో, అన్ని దోషాలూ తొలగి, ఇంకా ఎదుగుతావు.. లేకపోతే దెబ్బతింటావు అంటూ ఉచిత సలహా ఇచ్చాడు. కానీ రాజగోపాలుడికి అప్పటికే రెండు పెళ్లిళ్లయ్యాయి. రెండో భార్య కృత్తికకు ఆల్‌రెడీ పెళ్లయితే, భర్తతో విడదీసి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ జీవజ్యోతి మీద కన్నుపడింది. ఆమె తండ్రి ఎలాగూ పేదవాడు, తన దగ్గరే ఉద్యోగి, బెదిరించి ఆమెను మూడో పెళ్లి చేసేసుకుందాం అనుకున్నాడు, ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే బెదిరించాడు, ప్రలోభపెట్టాడు, కానీ ఆమె వినలేదు. అప్పటికే ప్రిన్స్ శాంతకుమార్‌ను ప్రేమించింది. ఇక రాజగోపాల్ వదిలేట్టు లేడని గ్రహించి, రామస్వామి బిడ్డను తీసుకుని సొంతూరుకు వెళ్లిపోయాడు. అయినప్పటీకీ రాజగోపాల్ వదల్లేదు. 9 మంది ముఠాకు సుఫారీ ఇచ్చాడు. సినిమాల్లోలాగే 2001లో జీవజ్యోతి భర్తను హత్య చేయించాడు. దీంతో తనకు జరిగిన అన్యాయంపై పోలీసులను ఆశ్రయించింది జీవజ్యోతి. డబ్బుంది కదా, మొదట్లో కేసు కదల్లేదు. జీవజ్యోతి ఏడుపు ఎవరికీ పట్టలేదు. కానీ మీడియా పట్టుకుంది. వెంటబడింది. హైప్రొఫైల్ నిందితుడు కదా. పైగా పిచ్చి జోస్యాల లింకు కూడా ఉంది. అలా అప్పటి ముఖ్యమంత్రి జయలలిత వద్దకు చేరింది. దీంతో వాడు ఎవడైతేనేం..? ఓ పట్టుపట్టండి అని పోలీసులకు అన్ని రైట్స్ ఇచ్చేసింది. మొరాయిస్తే అసలు కనిపించకుండా పోతావని హింట్ అందింది. ఇక చేసేదీ లేక రాజగోపాల్‌ పోలీసుల ముందు లొంగిపోయాడు. కేసును సుధీర్ఘంగా విచారించిన కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. కొన్నాళ్లకు బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ పోలీసులు వెంటబడ్డారు. 2009లో హైకోర్టు ఆ పదేళ్ల జైలు శిక్షను కాస్తా యావజ్జీవ శిక్షగా మార్చింది. దీంతో భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అపెక్స్ కోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్ధించింది. ఇక దిక్కులేక కోర్టులో లొంగిపోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. చివరికి జైలుశిక్ష ప్రారంభమైన పదిరోజులకే గుండెపోటులో ప్రాణాలు విడిచాడు రాజ్‌గోపాల్. సొంతూరుకు వెళ్లి, ఓ చిన్న హోటల్ పెట్టుకుంది జీవజ్యోతి. అది ఆమె తల్లి చూసుకునేది. తనేమో టైలరింగ్ షాపు పెట్టుకుంది. వధువుల డ్రెస్సులు కుట్టేది ఎక్కువగా. 18 ఏళ్లు పోరాడింది ఈ కేసులో. కోట్ల డబ్బును ఇస్తాను, కేసు విత్‌డ్రా చేసుకో, కోర్టులో మేం చెప్పినట్టు చెప్పు అని అడిగించాడు రాజగోపాల్ పలుసార్లు. లేకపోతే నిన్నూ ఖతం చేయిస్తాను అని బెదిరించాడు. ఆమె వినలేదు. వాడు చనిపోయి కూడా మూడేళ్లు అవుతోంది.  జైభీమ్ సినిమా తీసి ప్రశంసలు అందుకున్న జ్ఞానవేల్ ఇప్పుడు జీవజ్యోతి కథను తెరకెక్కిస్తున్నాడు. అదీ తమిళంలో కాదు. హిందీలో. సినిమా పేరు దోశా కింగ్. నిజంగానే ఆమె కథ బియాండ్ సినిమా కథ. అన్నిరకాల ఎమోషన్స్ ఉన్నాయి. తల్వార్, రాజీ సినిమాల నిర్మాణాల్లో భాగస్వాములైన జంగ్లీ పిక్చర్స్ ఈ జీవజ్యోతి సినిమాను నిర్మిస్తోంది. ఈ కేసుపై తమిళంలో, ఇంగ్లిషులో కొన్ని వందల కథనాలు వెలువడ్డాయి. కథ రాసుకోవడం పెద్ద కథేమీ కాదు. జరిగిన కథ జీవజ్యోతే చెబుతుంది. నిరుపమ సుబ్రహ్మణ్యన్ "Murder on the Menu" పేరిట ఓ పుస్తకం కూడా రాసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)