No title

Telugu Lo Computer
0


తాను విదేశాలకు వెళ్లేందుకు ఇంకా కేంద్రం అనుమతించకపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీకి కేజ్రీవాల్ లేఖ రాశారు. వీలైనంత త్వరగా తన పర్యటనకు అనుమతివ్వాలని లేఖలో కోరారు. సింగపూర్‌లో జరిగే ప్రపంచ నగరాల సదస్సుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఆహ్వానం లభించింది. ఈ సదస్సుకు హాజరై ఢిల్లీ మోడల్ గురించి ప్రపంచ నేతలకు కేజ్రీవాల్ వివరిస్తారు. ఢిల్లీలో సాగుతున్న పాలన, విద్యా విధానం, ఇతర అంశాలపై సదస్సులో వివరించాల్సి ఉంటుంది. అయితే, ఒక రాష్ట్ర సీఎం విదేశాలకు వెళ్లాలంటే కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం కేజ్రీవాల్ గత నెలలోనే కేంద్రానికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది. అయితే నెల రోజులు దాటినా కేంద్రం నుంచి ఇంకా అనుమతి రాలేదు. దీంతో కేంద్రం తీరుపై అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేస్తున్నారు. కావాలనే తనకు అనుమతి ఇవ్వడం లేదని, ఇది సరికాదని ఆరోపిస్తున్నారు. ''ఢిల్లీ మోడల్ గురించి వివరించేందుకు సింగపూర్ ప్రభుత్వం అక్కడ జరిగే ప్రపంచ సదస్సుకు నన్ను ఆహ్వానించింది. ప్రపంచ నేతల ముందు ఢిల్లీ గురించి వివరిస్తా. ఢిల్లీ గురించి ప్రపంచం తెలుసుకోవాలి అనుకుంటోంది. ఇది దేశానికి కూడా ఎంతో గర్వకారణం. అలాంటిది ఆ సదస్సుకు వెళ్లకుండా ఒక ముఖ్యమంత్రిని అడ్డుకోవడం దేశానికీ మంచిది కాదు. వీలైనంత త్వరగా అనుమతి ఇవ్వాలని కోరుతున్నా. అక్కడ మన దేశం గర్వపడేలా చేస్తా'' అంటూ కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)