కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ బోణీ

Telugu Lo Computer
0


కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్  బోణీ కొట్టింది. రెండో రోజు పురుషులు వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బరిలోకి దిగిన సంకేత్ మహదేవ్ సర్గార్ రజత పతకంతో మెరిశాడు. 55 కేజీల విభాగంలో బరిలోకి దిగిన సంకేత్ స్నాచ్ లో 113 కేజీలు బరువు ఎత్తాడు. అనంతరం క్లీన్ అండ్ జెర్క్ లో మరో 135 కేజీలు ఎత్తాడు. దాంతో ఓవరాల్ గా మొత్తం 248 కేజీల బరువు ఎత్తి రెండో రెండో స్థానంలో నిలిచాడు ఫలితంగా భారత్ కు రజత పతకం సొంతమైంది. సంకేత్ కు ఇదే తొలి కామన్వెల్త్ గేమ్స్ కావడం విశేషం. మలేసియాకు చెందిన మొహమ్మద్ 249 కేజీల బరువు ఎత్తి బంగారు పతకాన్ని సాధించాడు. శ్రీలంక వెయిట్ లిఫ్టర్ దిలంక యోదగే 225 కేజీల బరువు ఎత్తి కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ఆరంభం నుంచే భారత లిఫ్టర్ సంకేత్ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. మొదట జరిగిన స్నాచ్ రౌండ్ లో తొలి ప్రయత్నంలో 105 కేజీల బరువు ఎత్తిన అతడు.. రెండో ప్రయత్నంలో 111 కేజీలు ఎత్తాడు. ఇక మూడో ప్రయత్నంలో 113 కేజీల బరువు ఎత్తి స్నాచ్ లో అత్యధిక బరువు ఎత్తిన లిఫ్టర్ గా నిలిచాడు. స్వర్ణం గెలిచిన మొహమ్మద్ స్నాచ్ లో 107 కేజీలు మాత్రమే ఎత్తాడు. ఇక క్లీన్ అండ్ జర్క్ లో తొలి ప్రయత్నంలో సంకేత్ 130 కేజీలు ఎత్తాడు. మలేసియా లిఫ్టర్ తన తొలి ప్రయత్నంలో 138 కేజీలు ఎత్తాడు. అయినప్పటికీ సంకేత్ మూడు కేజీలతో లీడ్ లో నిలిచాడు. క్లీన్ అండ్ జర్క్ లో సంకేత్ తన రెండో ప్రయత్నంలో 139 కేజీలను ఎత్తడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడి కుడి మోచేతి పట్టేసింది. దాంతో రెండో ప్రయత్నంలో సఫలం కాలేకపోయాడు. నొప్పితో విలవిల్లాడుతూనే వెళ్లిపోయాడు. రెండు నిమిషాల అనంతరం మరోసారి 139 కేజీలను ఎత్తేందుకు ప్రయత్నించి విఫలం అయ్యాడు. ఈసారి గాయం మరింత తీవ్రం కాగా నొప్పితో చాలా ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో 142 కేజీలను ఎత్తడానికి వచ్చిన మలేసియా లిఫ్టర్ రెండో ప్రయత్నంలో విఫలం అయ్యాడు. కానీ, మూడో ప్రయత్నంలో ఎత్తి కేజీ డిఫెరెన్స్ తో బంగారు పతకాన్ని సాధించాడు. మెడల్ సెర్మనీకి సంకేత్ చేతికి కట్టు కట్టించుకొని వచ్చాడు. కామెంటేటర్ల ప్రకారం అతడికి చేతికి కంటే కూడా చెస్ట్ పై ఈ గాయం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)