పార్టీ గుర్తు మాతోనే ఉంటుంది !

Telugu Lo Computer
0


పార్టీ గుర్తు (బాణం, విల్లు) శివసేనతోనే ఉంటుందని, వాటిని ఎవరూ తీసుకెళ్లలేరని ఆ పార్టీ నేత, మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే చెప్పారు. శివసేన పార్టీ ఎన్నికల గుర్తు తమదేనంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రకటించిన నేపథ్యంలో ఉద్ధవ్ థాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో నిపుణులతో మాట్లాడినట్లు ఉద్ధవ్ థాక్రే వెల్లడించారు. ''పార్టీ గుర్తు విషయంలో చర్చ జరుగుతోంది. చట్ట ప్రకారం పార్టీ గుర్తును ఎవరూ తీసుకెళ్లలేరు. అది శివసేనతోనే ఉంటుంది. ఈ విషయంలో ఆందోళన అక్కర్లేదు. న్యాయ నిపుణులను కలిసిన తర్వాతే ఈ మాట చెబుతున్నాను'' అని వివరించారు. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ''రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలి. ప్రభుత్వం విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ప్రజలకు కల్పించాలి. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపే విషయంలో పార్టీకి చెందిన ఎంపీలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం'' అన్నారు. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమకు థాక్రే కుటుంబంపై గౌరవం ఉందని ప్రకటించడంపై కూడా ఉద్ధవ్ థాక్రే స్పందించారు. ''నిజంగానే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు తనపై, తన కుటుంబంపై గౌరవం ఉంటే బీజేపీ ఇన్నాళ్లు మా కుటుంబంపై అనేక ఆరోపణలు చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు. వాటిని ఎందుకు ఖండించలేదు. ఇప్పటికీ అదే బీజేపీతో కలిసుంటున్నారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు'' అని ఉద్ధవ్ విమర్శించారు. షిండే ఎన్నికను వ్యతిరేకిస్తూ ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 11న సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. మరోవైపు కొత్తగా ఎన్నికైన షిండేకు పార్టీ నుంచి రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. నవీ ముంబైకు చెందిన 32 మంది మాజీ కార్పొరేటర్లు షిండేకు మద్దతు ప్రకటించారు. మాజీ ఎంపీ అనంద్ రావ్ శివసేనకు తాజాగా రాజీనామా చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)