రహదారులు పునర్జీవం పోసుకోనున్నాయి ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఎంతోకాలంగా కనీస మరమ్మతులు కూడా నోచుకోని రహదారులు ఇప్పుడు పునర్జీవం పోసుకోనున్నాయి. ప్రయాణం అంటే భయపడే పరిస్థితికి వచ్చిన ప్రజలు ఎట్టకేలకు పనులు ప్రారంభం కావడంతో హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. రహదారుల పరిస్థితి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ రోడ్ల పునర్నిర్మాణంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అత్యంత దారుణంగా దెబ్బతిన్న 8 వేల 500 కిలోమీటర్ల మేర రహదారుల మరమ్మతులపై ప్రత్యేక కార్యాచారణను ప్రారంభించింది. కొత్త రోడ్ల నిర్మాణం మరమ్మతుల కోసం యుద్ధప్రాతిపదికన రూ. 2 వేల 200 కోట్ల నిధులను విడుదల చేసి పనులను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తుంది. సర్వే ఆధారంగా చేయాల్సిన పనులను గుర్తించిన రహదారులు, భవనాల శాఖ ఆ నివేదికను ప్రభుత్వానికి పంపింది. అధికారుల నివేదికలు పరిశీలించిన ప్రభుత్వం వెంటనే రోడ్ల పనులు ప్రారంభించేందుకు ఆదేశాలు ఇవ్వడంతో పాటు ప్రత్యేక నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రహదారులు, భవనాల శాఖ మూడు రకాలుగా దెబ్బతిన్న రహదారులను గుర్తించి వాటిని ప్యాకేజీల వారీగా విభజించి టెండర్లు పిలిచింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రధాన రహదారుల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించి శరవేగంగా పూర్తి చేసేందుకు పక్కా ప్రణాళికతో అధికార యంత్రాంగం ముందుకు సాగుతుంది. జులై నెలాఖరులోగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రహదారుల పనులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్న ధృడ సంకల్పంతో అధికారులు పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 400 కిలోమీటర్ల మేర రాష్ట్ర హైవేలను పూర్తిస్థాయిలో ఆధునీకరించేందుకు భారీగా నిధులు కేటాయించింది. ఈ పనుల నిమిత్తం రూ.1282 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. మొత్తం 850 ప్యాకేజీలుగా పనులను రహదారులు, భవనాల శాఖ విభజించింది. జూన్‌ 15వ తేదీ లోగా స్టేట్‌ హైవేల మరమ్మతులు, నిర్మాణాలు పూర్తిచేయాలన్న లక్ష్యంతో అధికార యంత్రాంగం పనిచేస్తోంది. ఇప్పటికే 30 నుంచి 40 శాతం మేర స్టేట్‌ హైవేల పనులు పూర్తయ్యాయి. స్టేట్‌ హైవేలు, జిల్లా ప్రధాన రహదారుల పునర్నిర్మాణం, మరమ్మతులు కోసం మొత్తం రూ. 800 కోట్ల బిల్లులను ఇప్పటి వరకు అధికారులు చెల్లించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)