కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఏకనాథ్ షిండే ?

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు అంతకంతకు ఉత్కంఠభరితంగా రేపుతున్నాయి. ఇప్పటి వరకు కొత్త పార్టీ పెట్టే యోచన తనకు అస్సలు లేదని చెబుతున్న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే కొత్తపార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది. 'బాలా సాహెబ్ శివసేన'పేరుతో పార్టీ ఏర్పాటు చేసి దిశగా సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో తనతోపాటు కలిసి వచ్చిన శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో షిండే చర్చలు జరుపుతున్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే కంటే ఎక్కువగా ఎమ్మెల్యేల మద్దతు ఉండి కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటుకు షిండే ముందు అడుగు వేయలేదు. దీన్ని బట్టి చూస్తే కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 50మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండి కూడా ప్రభుత్వ ఏర్పాటుగా షిండే ముందు అడుగు వేయలేదు. అంటే కొత్త పార్టీ ఏర్పాటు యోచనలోనే రెబెల్ ఎమ్మెల్యేలతో షిండే చర్చలు జరుపుతున్నారా అనిపిస్తోంది. షిండే ఆలోచనలు ఇలా ఉంటే మరోపక్క సీఎం ఉద్ధవ్ మాత్రం తన అధికారాన్ని నిలబెట్టుకొనేందుకు సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ వేసే పాచికలు పారకుండా తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు శతవిధాలా యత్నిస్తున్నారు. ఇంకోపక్క తిరిగి అధికారంలోకి వచ్చేలా బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా కనిపిస్తోంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యే వర్గం ఇంకా తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాల్సి ఉంది. కానీ షిండే మాత్రం తన వద్ద కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి తగినబలం ఉందని మీడియాకు ప్రత్యక్షంగా చూపించారు. బలపరీక్షకు తాను రెడీ అంటూ సంకేతాలు కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు బలపరీక్షకు గానీ..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే చర్యలు గానీ తీసుకోలేదు.అంటే షిండే కొత్త పార్టీ ఏర్పాటు తథ్యమేనా అనిపిస్తోంది. సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం రెబల్ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా షిండేను తీవ్రస్థాయిలో విమర్శించారు. కార్యకర్తలే శివసేన సంపద అని, వారు తనతో ఉన్నంత వరకూ తాను ఎలాంటి విమర్శలను పట్టించుకోనని ఉద్దవ్ అన్నారు. సొంత మనుషులే శివసేనకు ద్రోహం తలపెడుతున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు పై బీజేపీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు బిజెపి మిత్ర పక్షాలతో మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశం అయ్యారు. రామ్ దాస్ అత్వాలే సహా మిత్రపక్ష నేతలతో ఫడ్నవిస్ సమావేశమయ్యారు. మరోవైపు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఇలా ఎవరి అధికారం నిలబెట్టుకోవటానికి ఉద్ధవ్ ఠాక్రే..అధికారాన్ని చేజిక్కించుకోవటానికి బీజేపీ యత్నాలు చేస్తుంటే ఏక్ నాథ్ షిండే మాత్రం తనదైన శైలిలో కొత్త పార్టీ యోచనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇలా గంట గంటకు మహారాష్ట్ర రాజకీయాలు అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)