మహిందా రాజపక్సేను అరెస్ట్ చేయండి : కోర్టు ఆదేశం

Telugu Lo Computer
0


ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక అల్లాడిపోతోంది. ప్రజలు నిరసనలు హింసాత్మకంగా మారుతున్నాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో మహిందా రాజపక్సే తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. భద్రతా కారణాల కారణంగా ఆర్మీ ఆయన్ను రహస్య ప్రాంతానికి తరలించింది. ఇదిలా ఉండగా, కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే పదవీ బాధ్యతలు చేపట్టారు. ఐదు సార్లు ప్రధానిగా చేసిన అనుభవం ఉండటంతో ఈ సంక్షోభం నుంచి శ్రీలంకను బయటపడేస్తారని భావిస్తున్నారు. మాజీ ప్రధాని మహిందా రాజపక్సేను అరెస్ట్ చేయాలని సీఐడీ పోలీసులను  శ్రీలంక కోర్టు ఆదేశించింది. రాజపక్సేతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇటీవల అటార్నీ సెనక పెరీరా కొలంబో మెజిస్ట్రేట్ ముందు వ్యక్తిగత ఫిర్యాదు దాఖలు చేశారు. ఇటీవల కొలంబోలో గాలే ఫేస్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న సమయంలో రాజపక్సే అనుచరులు వచ్చి నిరసనకారులపై దాడులు చేశారని.. ఈ దాడుల్లో కనీసం 9 మంది మరణించారని… 200 మందికిపైగా ప్రజలు గాయపడ్డారని ఫిర్యాదు చేశారు. దీంతో కోర్ట్ మహిందా రాజపక్సేను అరెస్ట్ చేయాలని ఆదేశించింది. మాజీ ప్రధాని మహిందా రాజపక్సేతో పాటు పార్లమెంట్ సభ్యులు జన్సన్ ఫెర్నాండో, సంజీవ ఎదిరిమన్నే, సనత్ నిశాంత, మెటువా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ సమన్ లాల్ ఫెర్నాండో, సీనియర్ పోలీస్ అధికారి దేశబంధు తెన్నకూన్, చందన విక్రమరత్నేలను తక్షణమే అరెస్ట్ చేయాలని పిటిషన్ లో డిమాండ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)