ఈశాన్య రాష్ట్రాల్లో చమురు కొరత !

Telugu Lo Computer
0


గత కొన్ని రోజులుగా వరదల్లో చిక్కుకుని అసోం అస్తవ్యస్తంగా మారింది. 26 జిల్లాల్లో 6 లక్షల మందిపై వరదలు, వర్షాలు ప్రభావం చూపాయి. 33 వేల హెక్టార్లలో పంట దెబ్బతింది. వరద ప్రభావిత జిల్లాల్లో ఏర్పాటు చేసిన 89 సహాయక శిబిరాల్లో 50 వేల మందికి పైగా తలదాచుకుంటున్నారు. వరదలు, వర్షాలు, కొండచరియలు కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఊళ్లకు ఊళ్ల నీటమునిగాయి. జలదిగ్బంధనంలో వందలాది మంది చిక్కుకుని బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారు. నదులు మహోగ్రంగా ప్రవహిస్తుండటంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. అసోంలోని దిమా అసావో జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఆ రాష్ట్రంలోని బరాక్ లోయతో పాటు మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలకు రవాణా సౌకర్యం పూర్తిగా నిలిచిపోయింది. ఈశాన్య సరిహద్దు రైల్వే శాఖ లమ్డింగ్-బదర్‌పూర్ మధ్య 50 రైళ్లను రద్దు చేసింది. చాలా చోట్ల రైల్వే ట్రాకులు దెబ్బతినడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వీటిని పునరుద్దరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. దాంతో ముందు జాగ్రత్త చర్యగా పలు ఈశాన్య రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై కోటా విధానాన్ని అమలులోకి తెచ్చారు. ప్రస్తుతానికి ఆహార కొరత, లేదనీ.. పెట్రో స్టాక్ కూడా తగినంత ఉందనీ..కానీ పరిస్థితి మరికొన్ని నెలలు ఇలాగే కొనసాగితే.. ఇబ్బందులు తప్పవని అధికారులు చెబుతున్నారు. మూడు జిల్లాలతో కూడిన అసోంలోని బరాక్ లోయలో మూడు నెలలకు సరిపడ ఆహార పదార్థాలు, పది రోజులకు సరిపడ పెట్రో ఉత్పత్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అవి నిండుకునే లోపు రవాణా సౌకర్యాలు పూర్తిగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వరదల వల్ల రైలు, రోడ్డు మార్గాలు మూసుకుపోవడంతో.. విమాన టికెట్ ధరలకు రెక్కలొచ్చాయి. పలు విమానయాన సంస్థలు .. టికెట్ ధరలను అమాంతం పెంచేశాయి. 


Post a Comment

0Comments

Post a Comment (0)