సమాఖ్యతత్వం - సహకారాత్మకం కాదు, అది నిర్బంధం !

Telugu Lo Computer
0


పెట్రోలు, డీజిల్‌లపై  రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇంధనంపై విధించే పన్నుల్లో 68 శాతం వరకు కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటోందని, అయినప్పటికీ మోదీ రాష్ట్ర ప్రభుత్వాలను నిందిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, పెట్రోలు, డీజిల్ ధరలు అత్యధిక స్థాయిలో ఉన్నా, బొగ్గు కొరత, ఆక్సిజన్ కొరత వేధిస్తున్నా కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టేస్తోందన్నారు. మోదీ చెప్తున్న సమాఖ్యతత్వం సహకారాత్మకం కాదని, నిర్బంధమని అన్నారు. ''అధిక ఇంధన ధరలు - రాష్ట్రాలను నిందించు, బొగ్గు కొరత - రాష్ట్రాలను నిందించు, ఆక్సిజన్ కొరత - రాష్ట్రాలను నిందించు, అన్ని ఇంధన పన్నుల్లో 68 శాతం కేంద్రమే తీసుకుంటుంది. అయినప్పటికీ, పీఎం బాధ్యతను వదులుకుంటున్నారు. మోదీ సమాఖ్యతత్వం సహకారాత్మకం కాదు, అది నిర్బంధం'' అని రాహుల్ ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం కోవిడ్-19 పరిస్థితిపై మాట్లాడేందుకు వర్చువల్ విధానంలో ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెట్రోలు, డీజిల్ ధరల గురించి ప్రస్తావించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం ఉండాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరులో లీటరు పెట్రోలుపై ఎక్సయిజ్ డ్యూటీని రూ.5 చొప్పున, లీటరు డీజిల్‌పై ఎక్సయిజ్ డ్యూటీని రూ.10 చొప్పున తగ్గించిందని, దీనికి అనుగుణంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యాట్‌ను తగ్గించి, ఆ ప్రయోజనాన్ని ప్రజలకు అందజేశాయని, మరికొన్ని రాష్ట్రాలు ఈ విధంగా చేయలేదని చెప్పారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్, కేరళ, జార్ఖండ్ వంటి రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించలేదని చెప్పారు. దీనివల్ల ఆ రాష్ట్రాల ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. అదే విధంగా పన్నులు తగ్గించిన రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతోందన్నారు. కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాలు తమ వ్యాట్‌ను తగ్గించుకున్నాయని చెప్పారు. వ్యాట్ తగ్గించని రాష్ట్రాలు దానిని తగ్గించిన రాష్ట్రాల కన్నా ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాయన్నారు. మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్, శివసేన, టీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి స్పందిస్తూ, ప్రతిపక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో దిగుమతి చేసుకునే మద్యంపై పన్నులను తగ్గించడం కన్నా ఇంధనంపై పన్నులను తగ్గిస్తే పెట్రోలు చౌక ధరకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లీటరు పెట్రోలు, డీజిల్‌లపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) రూ.14.50 నుంచి రూ.17.50 వరకు ఉంటోందని, ఇతర పార్టీల పరిపాలనలో ఉన్న రాష్ట్రాల్లో వ్యాట్ రూ.26 నుంచి రూ.32 వరకు ఉంటోందని చెప్పారు. ప్రతిపక్షాల ఉద్దేశం కేవలం నిరసన తెలిపడం, విమర్శించడమేనని, ప్రజలకు ఉపశమనం కల్పించాలన్న లక్ష్యం ప్రతిపక్షాలకు లేదని ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)