భారతదేశ కుబేరులు !

Telugu Lo Computer
0


భారతదేశ కుబేరుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన వ్యక్తిగత సంపద 90.7 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. దీంతో భారత్‌లో అత్యంత సంపన్నుడిగా, ప్రపంచవ్యాప్తంగా 10వ స్థానంలో నిలిచాడు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ 90 బిలియన్ల డాలర్లతో రెండో స్థానంలోనూ నిలవగా, హెచ్ సి ఎల్  టెక్నాలజీస్ గౌరవ చైర్మన్ శివ్ నాడార్ 28.7 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపదతో మూడో స్థానంలో ఉన్నారు. గతేడాది లాగానే టాప్‌-3 జాబితాలో ముకేశ్ అంబానీ, గౌతం అదానీ, శివ్ నాడార్ నిలిచారు. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ముకేశ్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ ఏడు శాతం పెరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు రిఫైనరీ కాంప్లెక్స్‌, దేశవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌తో జియో, తదితర వ్యాపారాల్లో రిలయన్స్ సేవలందిస్తున్నది. భారత్‌తో పాటు ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద కుబేరుడు గౌతం అదానీ వ్యక్తిగత సంపద 90 బిలియన్ల డాలర్లు. నౌకాశ్రయాలు మొదలు విమానాశ్రయాల వరకు, థర్మల్ విద్యుత్‌, బొగ్గు రంగాల్లో అదానీ గ్రూప్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. గత కొన్ని నెలలుగా కుబేరుల్లో మొదటి స్థానం కోసం ముకేశ్ అంబానీ, గౌతం అదానీ పోటీ పడుతున్నారు. వచ్చే దశాబ్దిలో భారత్‌ను హరిత ఇంధన శక్తిగా తీర్చిదిద్దేందుకు ముకేశ్ అంబానీ, గౌతం అదానీ బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతున్నారు. కరోనా మహమ్మారిని నిరోధించేందుకు వ్యాక్సిన్ రూపొందించడంలో ముందు వరుసలో నిలిచిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత సైరస్ పూనావాలా కుబేరుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. సైరస్ పూనావాలా వ్యక్తిగత సంపద 24.3 బిలియన్ల డాలర్లు. డీ-మ్యాట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమానీ గతేడాది ప్రపంచంలోని టాప్‌-100 బిలియనీర్ల జాబితాలో చేరారు. ఈ ఏడాది 20 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత సంపదతో దేశంలో ఐదో కుబేరుడి అవతారం ఎత్తారు. ఉక్కు ధరలు పెరిగిపోవడంతో ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ వ్యక్తిగత ఆస్తి 17.9 బిలియన్ డాలర్లు. భారత కుబేరుల జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు. ఓపీ జిందాల్ గ్రూప్ అధినేత సావిత్రి జిందాల్ 17.7 బిలియన్ల డాలర్లతో ఏడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార్ మంగళం బిర్లా వ్యక్తిగత సంపద 16.5 బిలియన్ డాలర్లు. కుబేరుల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మాస్యూటికల్స్ హెడ్ దిలీప్ సంఘ్వీ 15.6 బిలియన్ డాలర్లతో తొమ్మిదో ర్యాంక్‌, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కొటక్ 14.3 బిలియన్ డాలర్లతో పదో ర్యాంక్‌లో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే భారత్‌లో కొత్తగా బిలియనీర్లు పెరిగారు. 2020-21లో 140 మంది కుబేరులు ఉంటే, గత ఆర్థిక సంవత్సరంలో 166కు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా కంపెనీలు ఐపీవోల ద్వారా సుమారు 15.6 బిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చుకున్నారని ఫోర్బ్స్ నివేదిక తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)