రూ.20.86వేల కోట్లు ఇవ్వండి !

Telugu Lo Computer
0


ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శుక్రవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నివాసానికి వెళ్లి సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ఆమెకు వినతిపత్రం సమర్పించారు. స్టాలిన్‌తోపాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, డీఎంకే ఎంపీ టిఆర్‌బాలు కూడా నిర్మలా సీతారామన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెల్లించాల్సిన జీఎస్టీ బకాయిలు రూ.13,504 కోట్లను తక్షణమే విడుదల చేయాలని స్టాలిన్‌ ఆమెకు విజ్ఞప్తి చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సుమారు 20 వేల కోట్లకు పైగా రెవెన్యూ కోల్పోయే అవకాశం ఉందని, ఈ పరిస్థితుల్లో కేంద్రం నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జీఎస్టీ పరిహారం చెల్లించే గడువును మరో రెండేళ్లకు పొడిగించాలని కూడా ఆయన విన్నవించారు. రాష్ట్రంలో సరుకులు, సేవా పన్నుల రూపంలోని పెండింగ్‌ బకాయిలు రూ.13,504 కోట్ల మేర కేంద్రం నుంచి విడుదల కావాల్సి ఉందని తెలిపారు. స్థానిక సంస్థలకు కూడా కేంద్రం నుంచి భారీగా నిధులు విడుదల చేయాల్సి ఉందని, ఇటీవల తమ ప్రభుత్వం నగరపాలక, పురపాలక, పట్టణ పంచాయతీ ఎన్నికలను నిర్వహించిందని, ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు పెండింగ్‌లో ఉన్న నిధులను కూడా వెంటనే మంజూరు చేయాలని కోరారు. అంతే కాకుండా కరోనా సంక్షోభం కారణంగా వైద్య రంగానికి అధికంగా నిధులు కేటాయించడం వల్ల ప్రభుత్వ ఆదాయవనరులు కూడా తగ్గుముఖం పట్టాయని స్టాలిన్‌ ఆమెకు వివరించారు. ఆయన విజ్ఞప్తిని ఆలకించిన నిర్మలా సీతారామన్‌.. తప్పకుండా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)