అహ్మదాబాద్‌లో మోదీ భారీ రోడ్‌షో

Telugu Lo Computer
0


ఉత్తర్‌ప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల భాజపా అఖండ విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. నేటి ఉదయం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం విమానాశ్రయం నుంచి భాజపా రాష్ట్ర కార్యాలయం 'శ్రీకమలం' వరకు ప్రధాని భారీ రోడ్‌షో చేపట్టారు. ఇందులో దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్లు సమాచారం. ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రయాణిస్తూ ప్రజలందరికీ మోదీ అభివాదం చేశారు. గుజరాత్‌లో ప్రధాని మోదీ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. రోడ్‌షో అనంతరం రాష్ట్ర భాజపా ఎంపీలు, ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని జీఎండీసీ గ్రౌండ్‌లో జరిగే మహా పంచాయత్‌ సమ్మేళనం 'మారుగ్రామ్‌- మారు గుజరాత్‌' కార్యక్రమంలో.. కొత్తగా ఎన్నికైన 1.38 లక్షల మంది స్థానిక సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. శనివారం ఉదయం రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సైతం పాల్గొననున్నారు. అనంతరం ప్రధాని మోదీ.. సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో 'ఖేల్‌ మహాకుంభ్‌' క్రీడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ భారీ కార్యక్రమ ప్రారంభ వేడుకల్లో 1100 మంది కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ క్రీడల్లో పాల్గొనడానికి ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)