వన్నియార్ కోటా' రద్దు చేసిన సుప్రీంకోర్టు

Telugu Lo Computer
0


తమిళనాడు ప్రభుత్వం వన్నియార్ వర్గానికి కేటాయించిన 10.5 శాతం కోటాను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మద్రాస్ హైకోర్టు ఇదివరకే వన్నియార్ కోటాను రద్దు చేసింది. తాజాగా ఆ తీర్పును సుప్రీం సమర్థించింది. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యా సంస్థల్లో వన్నియార్ కులస్తులకు తమిళనాడు ప్రభుత్వం 10.5 శాతం కోటాను కేటాయించింది. జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ తీర్పును ప్రకటించింది. వన్నియాకుల క్షత్రియులను మరో గ్రూపుగా చూడలేమని, ఎంబీసీ గ్రూపులో ఉన్న 115 కులాలతో ఆ వర్గం కలిసి ఉండాల్సిందే అని సుప్రీం బెంచ్ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో వన్నియార్ కమ్యూనిటీకి 10.5 శాతం రిజర్వేషన్ ను గత ఏడాది అన్నాడీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వం కల్పించింది. తాజాగా "వన్నియార్ రిజర్వేషన్ చట్టం 2021" చట్టం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 1న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ చట్టం.. ఆర్టికల్ 14, 15, 16 ఉల్లంఘన కిందకు వస్తుందని కోర్టు పేర్కొంది. మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఏప్రిల్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందే అన్నాడీఎంకే ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో వన్నియార్ రిజర్వేషన్ చట్టాన్ని ఆమోదించింది. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన డీఎంకే కోటాను అమలు చేసింది. సమాజంలో వెనుకబడ్డ వర్గాన్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ఆయా వర్గాలకు ప్రత్యేక కోటా కల్పించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందని పిటిషనర్లు సుప్రీంలో వాదించారు. రాష్ట్ర శాసనసభ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిదని, పట్టాలి మక్కల్ కట్చి  పార్టీ వ్యవస్థాపకుడు రామదాస్ హైకోర్టు తీర్పును కొట్టేయాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. వన్నియార్‌లు తమిళనాడులోని వెనుకబడిన వర్గాలలో అతి పెద్ద వర్గం. వారు చాలా కాలంగా తమకు ప్రత్యేక కోటా కోసం పోరాడుతున్నారు. అత్యంత వెనుకబడిన తరగతి కోటాలో 20 శాతం కోటా ఉంటే అందులో 10.5% కోటా తమ వర్గానికి సాధించుకున్నారు. మిగతా 9.5 శాతం కోటాని 100 కంటే ఎక్కువగా ఉన్న ఇతర సంఘాలు పంచుకోవలసి ఉంది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఇందులో వెనుకబడిన కులాలకు 30 శాతం, అత్యంత వెనుకబడిన కులాలకు 20 శాతం, షెడ్యూల్డ్ కులాలకు 18 శాతం మరియు షెడ్యూల్డ్ తెగలకు 1 శాతం చొప్పున ఉంది.


Post a Comment

0Comments

Post a Comment (0)