చదివింపుల విందు!

Telugu Lo Computer
0


తమిళనాట ఈ సంప్రదాయం రెండు జిల్లాల్లో కష్టకాలంలో ఉన్న ఎంతో మందికి ఆర్థిక సాయం అందిస్తోంది, కొత్త వ్యాపారాలు చేయాలనుకునేవారికి పెట్టుబడిని అందిస్తోంది. తమిళంలో 'మొయ్ విరుందు' అనే ఈ బంతి భోజనాల ఏర్పాట్లు ఎంతోమందికి ఉపాధిని, కొత్త ఉద్యోగ అవకాశాలను అందించడంతోపాటూ ప్రజల మధ్య పరస్పర సహకారాన్ని కూడా పెంచుతోంది. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడడం నేర్పుతోంది. తమిళనాడులోని తంజావూరు, పుదుక్కోట్టై జిల్లాల సరిహద్దు గ్రామాల్లో ప్రతి ఏటా జరిగే ఈ చదివింపుల విందుల్లో పండుగ వాతావరణం అందరినీ ఆకర్షిస్తోంది. కరోనా,  తుపాను ప్రభావంతో గత రెండేళ్లుగా ఇవి కనిపించకపోయినా, ఇప్పుడు కరోనా మహమ్మారి తీవ్రత తగ్గడంతో ఈ గ్రామాల్లో మళ్లీ ఈ చదివింపుల విందుల హడావిడి మొదలైంది. తంజావూరు జిల్లాలోని పెరవూరని, పుదుక్కోట్టై జిల్లాలోని కీరమంగళం రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉంటాయి. ఈ గ్రామాల్లో ఇప్పుడు చదివింపుల విందుల సందడి బాగా కనిపిస్తోంది. గతంలో 2019లో ఒక వ్యక్తి చికెన్, మటన్‌తో చదివింపుల విందు ఇచ్చారు. ఆయన విందు ఆరగించడానికి వచ్చినవారు ఆయనకు భారీగా చదివింపులు ఇచ్చారు. దీంతో ఆయన ఏకంగా 4 కోట్ల మొత్తం అందుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కరోనా వల్ల 2020లో ఒకటి, రెండు చోట్ల ఈ చదివింపుల విందులు జరిగాయి. గత ఏడాది కరోనా వ్యాప్తిని నిరోధించడానికి చర్యలు తీసుకోవడంతో పెళ్లిళ్లు లాంటి వేడుకలకు తక్కువ మందిని అనుమతించారు. దీంతో ఎక్కువ మంది గుమిగూడకుండా జిల్లా కోర్టు ఈ చదివింపుల విందులను కూడా నిషేధించింది. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో తంజావూరు జిల్లా పెరవూరని, తిరుచిరంబాలం, పుదుకోట్టై జిల్లాలోని కొత్తమంగళంలో ఈ చదివింపుల విందులు జరుగుతున్నాయి. ఇంకా చాలా గ్రామాల్లో ఈ విందులకు తేదీలు నిర్ణయించుకుంటున్నారు. తమిళంలో మెయ్ అంటే తెలుగులో చదివింపులు అని అర్థం. సాధారణంగా పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలు జరిగినపుడు బంధుమిత్రులు వచ్చి వధూవరుల తరఫున తమకు తోచినంత డబ్బు లేదా, వస్తువుల చదివిస్తుంటారు. ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో రాసుకుని, మైక్‌లో అనౌన్స్ కూడా చేస్తుంటారు. ఆ పెళ్లి వారు తర్వాత తమకు చదివించిన వారి ఇళ్లలో ఏవైనా శుభకార్యాలు జరిగినపుడు అదే మొత్తాన్ని తిరిగి చదివిస్తుంటారు. ఇప్పుడు అదే పద్ధతిని తమిళనాడులోని ఈ గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉండి ఆర్థిక సాయం అవసరమైనా, ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి లాంటివి కావాలన్నా, వేరే ఇంకేదైనా అవసరం ఉన్నా ఇలా భారీగా విందు నిర్వహించి, వచ్చిన వారు తమకు తోచినంత ఇస్తే దానితో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఈ విందు ఇచ్చేవారు వివాహాలు, మిగతా శుభకార్యాలకు వేసినట్లే ఆహ్వాన పత్రికలు వేయిస్తున్నారు. అతిథులను ఆహ్వానించే బ్యానర్ల నుంచీ విందు కోసం మండపాలు, వంటవాళ్లను బుక్ చేయడం వరకూ భారీగా ఏర్పాట్లు చేస్తారు. విందు ఇచ్చే ప్రాంతంలో వండివార్చి రాశులు పోసిన అన్నం, స్టవ్వుల మీద పెద్ద పెద్ద గిన్నెల్లో ఉడుకుతున్న మటన్, చికెన్ సువాసన ఉంటుంది. బంతి భోజనంలో అరటి ఆకుల్లో వడ్డిస్తున్న పదార్థాలు చూడగానే నోరూరిపోతుంది. మొత్తంగా చూస్తే ఈ విందు చాలా ప్రత్యేకమైనది. కరోనా ఆంక్షలు క్రమంగా సడలించి వీటికి అనుమతి ఇస్తుండడంతో ఈ విందులు మళ్లీ పెరుగుతున్నాయి. తమిళనాట ఈ విందులు సాధారణంగా జులై-ఆగస్టు మధ్యలో వచ్చే తమిళ ఆడి మాసంలో జరుగుతాయి. ఒకేసారి ఎక్కువమంది ఇలాంటి విందులు ఇవ్వకుండా కొన్ని కట్టుబాట్లు కూడా ఉంటాయి. ఒకరు ఒకసారి చదివింపుల విందు ఇస్తే ఐదేళ్ల తర్వాతే మరోసారి ఇవ్వాలి. ఇదంతా గ్రామస్థులే కలిసి నిర్ణయించుకుంటారు. 'మొయి పార్టీలు 50 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలనే లక్ష్యంతో తంజావూరు జిల్లాలోని పెరవూరని ప్రాంతంలో మొదలైన ఈ సంప్రదాయం ఇప్పుడు పుదుకోట్టై జిల్లాలోని గ్రామాల్లోనూ కొనసాగుతోంది" అని కొత్తమంగళానికి చెందిన సురేష్ అన్నారు. వ్యాపారం ప్రారంభించడానికి, ఇల్లు కట్టుకోడానికి, కారు కొనడానికి, బ్యాంకులో డిపాజిట్ చేయడానికి, పెళ్లిళ్లు లాంటి శుభకార్యాల కోసం, ఇంకా ఎన్నో అవసరాల కోసం ఈ చదివింపుల విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందు ఇవ్వాలనుకునేవారికి ఖర్చుల కోసం బ్యాంకులు రుణాలు కూడా ఇస్తున్నాయి. "ఈ విందు ద్వారా ఆర్థిక సాయం పొందిన వారు ఎవరెవరు ఎంతెంత మొత్తం ఇచ్చారో వివరంగా రాసి ఉంచుకుంటారు. తర్వాత దానిని ఐదేళ్లలో వారందరికీ తిరిగి ఇచ్చేస్తారు. అందుకే ఇది సంప్రదాయం మాత్రమే కాదు, కలిసి ఉంటే ఎంత ప్రయోజనం ఉంటుందో చెప్పే మార్గం ఇది. 

Post a Comment

0Comments

Post a Comment (0)