పెట్టుబడులు పెట్టండి - అభివృద్ధికి ఊతమివ్వండి

Telugu Lo Computer
0


వివిధ రంగాల్లో భారత కార్పోరేటర్లు పెట్టుబడులు పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా బడ్జెట్‌లో ప్రకటించిన ప్రకటనల నుండి ప్రయోజనం అందిపుచ్చుకోవచ్చునని సీఐఐ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలిపారు. దీంతో పెట్టుబడుల చక్రం వేగం అందుకొని, వృద్ధికి ఊతమిస్తుందని తెలిపారు.  బడ్జెట్‌లో మూలధన వ్యయాలను పెంచామని, అటు వృద్ధికి, ఇటు ప్రయివేటు పెట్టుబడులకు ఊతమిచ్చే రెండు లక్ష్యాలతో పనిచేశామని, పెట్టుబడులకు సరైన సమయమన్నారు. అంతకుముందు కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. అటామిక్ ఎనర్జీ, స్పేస్ రంగాల్లోను ఇన్వెస్ట్ చేయాలన్నారు. కొత్త రంగాలైన బల్క్ డ్రగ్ వ్యాక్సీన్, జినోమ్‌లలో భారీ అవకాశాలున్నాయన్నారు. 2019 సెప్టెంబర్‌లో కార్పోరేట్ ట్యాక్స్‌ను 22 శాతానికి తగ్గించారు. కొత్త కంపెనీలు అయితే 15 శాతం కార్పోరేట్ ట్యాక్స్ మాత్రమే చెల్లించాలి. తగ్గించిన ఈ కార్పోరేట్ ట్యాక్స్ మార్చి 2024 వరకు పొడిగించామని గుర్తు చేశారు. పారిశ్రామిక, తయారీ అత్యధికస్థాయిల్లో ఉన్నందున పరిశ్రమ ఈ అవకాశాన్ని కోల్పోవద్దని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను వివిధ మార్గాల్లో పరిష్కరిస్తున్నామని తెలిపారు. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ సామాగ్రిని అద్దెకివ్వడం లేదా రుణాలను ఇవ్వడం ద్వారా తెచ్చుకునేందుకు ఇటీవలి బడ్జెట్ సహకరిస్తుందని తెలిపారు. పోషకాలు, ఎరువులను ప్రభుత్వం అందుబాటు ధరలో ఉంచిందన్నారు. గృహాలు, వంట గ్యాస్, విద్యుత్, ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ పథకాలకు మద్దతిస్తున్నామన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో వడ్డీ రేట్లు, కమోడిటీ ధరలు పెరుగుతున్న అంశాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది బడ్జెట్‌లో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రయివేటీకరిస్తామన్న అంశంపై మాట్లాడుతూ.. ప్రయివేటీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)