మంచాన్నే చితిగా మార్చుకుని మహిళ సజీవదహనం!

Telugu Lo Computer
0


తెలంగాణ లోని జగిత్యాల జిల్లా కేంద్రంలోని బంజరు దొడ్డి ప్రాంతానికి చెందిన కొండ ఈరమ్మ భర్త రత్నం 20 ఏళ్ల క్రితమే మృతి చెందాడు. భర్త మరణించినప్పటికీ కన్న కొడుకుని పెంచటం కోసం ఈరమ్మ ఎంతో కష్టపడింది. కూలినాలి చేసుకుని జీవిస్తూ కొడుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది. వారికి ఒక కొడుకు కూడా పుట్టాడు. కొడుకు, కోడలు సంతోషంగా జీవిస్తున్నారు అని సంతోషపడిన సమయంలోనే విధి ఆడిన వింత ఆటలో 8 సంవత్సరాల క్రితం కొడుకు, కోడలు ఇద్దరూ ప్రమాదంలో మృతి చెందారు. అప్పటి నుండి మనవడి పెంచుతూ జీవనం సాగిస్తుంది. అయితే గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో పోరాడుతూ మంచానికే పరిమితం అయింది ఈరమ్మ. మనవడు తీసుకొచ్చే కూలి డబ్బులతో బ్రతకడంతో పాటుగా తన మందులకు ఖర్చు చేయాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇటీవల ఈరమ్మకు క్యాన్సర్ గా నిర్ధారణ అయింది. దీంతో క్యాన్సర్ కు అయ్యే ఖర్చు భరించలేనిదిగా ఉండటంతో ఆవేదన చెందింది. మనవడికి భారంగా మారానని బాధపడింది. ఇప్పటికే జీవితంలో భర్త చనిపోవడం, ఆ తర్వాత కొడుకు, కోడలు చనిపోవడం ఇలా అనేక దెబ్బల మీద దెబ్బలు తగిలిన ఈరమ్మ తన జీవితం ఎందుకు అనుకుంది. ఉన్న ఒక్కగానొక్క మనవడికి భారంగా బ్రతుకకూడదని నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రి ఖర్చుల కోసం మనవడు ఇబ్బంది పడతాడని భావించి తాను పడుకుని వున్న మంచాన్ని చితిగా మార్చుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన మంచానికి తానే నిప్పు పెట్టుకొని సజీవ దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)