మేకపాటి గౌతమ్‍రెడ్డి హఠాన్మరణం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‍రెడ్డి (50) హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని ఇంట్లోనే కుప్పకూలారు. వారం రోజుల దుబాయ్ పర్యటన ముగించుకుని ఆదివారమే హైదరాబాద్ చేరుకున్న మంత్రి మేకపాటి ఈరోజు ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటుతో కుప్పకూలడంతో కుటుంబీకులు, సిబ్బంది హుటాహుటిన ఆయనను జూబ్లీ హిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో ఆస్పత్రి వైద్యులు ఎమర్జెన్సీ ప్రాతిపదికన చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ, వైద్యులకు ఆయన పల్స్ దొరకలేదని, చికిత్సకు శరీరం ఏమాత్రం సహకారం అందించలేదని తెలుస్తోంది. కొద్ది నిమిషాల ప్రయత్నం తర్వాత గౌతమ్ రెడ్డి మరణాన్ని వైద్యులు ధృవీకరించారు. మేకపాటి గౌతమ్‌రెడ్డికి భార్య శ్రీకీర్తి, కుమార్తె అనన్య రెడ్డి, కొడుకు అరజున్ రెడ్డి ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతమ్ రెడ్డి జగన్ కేబినెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన మరణవార్తతో వైసీపీ శ్రేణులు పెనువిషాదంలో ముంచాయి.  గౌతమ్ రెడ్డి కుటుంబీకులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడినట్లు తెలుస్తోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి 1971 నవంబర్‌2న జన్మించారు. నెల్లూరు జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబం నుంచి ఎదిగివచ్చిన గౌతమ్ రెడ్డి స్వస్థలం మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. ప్రస్తుతం ఆయన ఆత్మకూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో ఆత్మకూరు ఎమ్మెల్యేగా 30,191 ఓట్లతో గెలుపొందారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఉదయగిరి, ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు పార్లమెంట్‌ సభ్యుడిగా పనిచేశారు. మేకపాటి కుటుంబానికి జిల్లాలో రాజకీయంగా మంచిపట్టు ఉంది. వైసీపీ తరఫున మళ్లీ ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు.

Post a Comment

0Comments

Post a Comment (0)