ఇది ఎక్కడుందో చెప్పండి..?

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ యూజర్లకు ఓ ప్రశ్న సంధించారు. బహుళ అంతస్తుల్లో ఉన్న ఓ భవనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి ఇది ఎక్కడ ఉందో చెప్పగలరా? అంటూ కేటీఆర్ నెటిజన్లను ప్రశ్నించారు. బహుళ అంతస్తుల్లో ఉన్న ఆ భవనం ఆకాశాన్ని తాకినట్లు ఉంది. విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న ఆ భవనం చుట్టూ చిన్నచిన్న భవన సముదాయాలు ఉన్నాయి. మరి ఆ భవనం ఎక్కడుందో మీరు పసిగట్టగలరా? ఆ ఫోటోపై మీరూ ఓసారి లుక్కేయండి. ఆ భవనం గురించి తెలుసుకోవాలంటే బంజారాహిల్స్ వెళ్లాల్సిందే. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో మొత్తం నాలుగు టవర్లతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. ఒక టవర్‌ను 20 అంతస్తులతో, మిగతా మూడు టవర్లను 16 అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్, పోలీసు ఉన్నతాధికారులు నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని సూచించారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ రానున్న కాలంలో నగరానికి మూడో కన్నుగా మారనుందని నగర సీపీ సీవీ ఆనంద్‌ అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (సీసీసీ) నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. నాలుగు టవర్ల భవనం, 20 అంతస్తుల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళిక మ్యాప్‌లను ఆర్‌ అండ్‌ బీ, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు సీపీకి వివరించారు. భవనంలో భద్రత ప్రమాణాలు, ముఖ్యమంత్రి, చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయాలతో పాటు సమావేశ మందిరాలు, ఆడిటోరియాలు, పార్కింగ్‌ ప్రాంతాలను సీపీ సందర్శించారు. ప్రాజెక్ట్‌లకు సంబంధించిన వివిధ అంశాల అమలు కోసం ఏజెన్సీలు, విక్రేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌ అండ్‌ బీ, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సీపీ సూచించారు. నగర పోలీసుల నుంచి పూర్తి సహకారం ఉంటుందని, మార్చి 31వ తేదీలోగా పనులన్నీ పూర్తి చేసి, ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలన్నారు. కమిషనర్‌ వెంట వెస్ట్‌జోన్‌ డీసీపీ జోయల్‌ డేవిస్‌, అడ్మిన్‌ డీసీపీ సునీతారెడ్డి తదితరులు ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)