ఎర్రకోటకు వారసురాలిని నేనే !

Telugu Lo Computer
0


కోల్‌కతా శివారుల్లో ఓ గుడిసెలో సాదాసీదా జీవనం సాగిస్తున్న సుల్తానా బేగమ్ ఆ కోట తనకే చెందుతుందని చెబుతోంది. కేవలం ప్రభుత్వం ఇచ్చే 6 వేల పెన్షన్ మీద బ్రతుకుతోన్న ఆమె తన గాధను వెల్లడించింది. తన భర్త మీర్జా మొహమ్మద్ బేదర్ భక్త్ .. చిట్టచివరి మొఘల్ పాలకుడికు మునిమనవడు అని ఆమె అంటోంది. మీర్జాను బేదర్ భక్త్‌తో జరిగిన పెళ్లికి సంబంధించిన రికార్డును ఆమె పదిలపరుచుకున్నది. సుల్తానా బేగం భర్త మీర్జా భక్త్ 1980లోనే మరణించాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా జీవిస్తోంది. అంతేకాదు ఆమె కోర్టుల చుట్టూ కూడా తిరుగుతోంది. తాను మొఘల్ వారసురాలినని, తనకు రాయల్ హోదా ఇవ్వాలని, నష్టపరిహారన్ని కూడా చెల్లించాలని సుల్తానా కోర్టులో కేసు వేసింది. 17వ శతాబ్ధంలో నిర్మించిన ఢిల్లీలోని ఎర్రకోటకు తానే వారసురాలిని అని సుల్తానా బేగం కోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ప్రభుత్వం న్యాయం చేస్తుందని భావిస్తున్నట్లు ఆమె ఓ మీడియాతో తెలిపింది. ఏదైనా వస్తువు ఎవరికైనా చెందితే, దాన్ని వాళ్లకు ఇచ్చేయాలన్న అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేసింది. చనిపోయిన తన భర్త చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహూదర్ షా జాఫర్ వంశానికి చెందినవాడని ఆమె అంటోంది.1837లో మొఘల్ చక్రవర్తి జాఫర్‌కు పట్టాభిషేకం జరిగింది. కానీ అప్పటికే బ్రిటీషర్లు ఢిల్లీని చుట్టేశారు. ఆ తర్వాత సిపాయి ముట్నీ యుద్ధంలో మొఘల్ సామ్రాజ్యం నిర్వీర్యమైంది. నిజానికి రాయల్ కుటుంబం సరెండర్ అయినా.. బ్రిటీష్ సేనలు జాఫర్‌కు చెందిన పది మంది పిల్లల్ని హతమార్చారు. తలదాచుకునేందుకు మయన్మార్‌కు వెళ్లిన జాఫర్‌ను ఆ తర్వాత అయిదేళ్లకు చంపేశారు. బ్రిటీషర్లు దేశం విడిచి వెళ్లిన తర్వాత .. భారత తొలి ప్రధాని నెహ్రూ ఎర్రకోటపైనే జాతీయ జెండా ఎగురవేశారు. భారత ప్రభుత్వం అక్రమంగా ఎర్రకోటను ఆక్రమించిందని, ఆ ప్రాపర్టీని తనకు ఇవ్వాలంటూ సుల్తానా తన కోర్టు అఫిడవిట్‌లో పేర్కొన్నది. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. కానీ ఆమె నిజమైన వారసురాలా కాదా అన్న విషయాన్ని మాత్రం తేల్చలేదు. జాఫర్ దేశం విడిచి వెళ్లి 150 ఏళ్లు దాటింది, కానీ ఇప్పటి వరకు ఎవరూ వారసత్వ హక్కుల గురించి కేసు వేయలేదని కోర్టు అభిప్రాయపడింది. 1965లో 14 ఏళ్ల వయసులో సుల్తానా బేగం పెళ్లి చేసుకున్నది. కానీ పేదరికం, భయం వల్ల సరైన జీవితం గడపలేకపోయింది. కోల్‌కతా శివార్లలో ఆమె కొన్నాళ్లు ఓ టీ షాపు నడిపింది. కానీ రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఆ షాపును ఆమె కోల్పోయింది. జీవనాధారం లేకున్నా.. వారసత్వ హక్కుల్పి కల్పించాలంటూ ఆమె కోర్టును కోరుతోంది. ఇప్పుడు కాకపోయినా.. ఇంకా పదేళ్లకైనా న్యాయం జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.


Post a Comment

0Comments

Post a Comment (0)