No title

Telugu Lo Computer
0


శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ బొరిగిపేట గ్రామానికి చెందిన రైల్వే గ్యాంగ్‌మెన్‌ సంపతిరావు దేవరాజ్‌ అనే వ్యక్తి.. గంగాధరపేట గ్రామానికి చెందిన మహిళతో ఘర్షణ పడి కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో తలకు, మెడ, చేతులపై గాయపడింది. గట్టిగా కేకలు వేయడంతో దేవరాజ్ పారిపోయాడు. దీంతో బాధితురాలు అతడి నుంచి తప్పించుకుని గ్రామస్తుల సాయంతో టెక్కలి ఆస్పత్రిలో చేరింది. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాధిత మహిళ కొప్పల కమలకు నిందితుడు సంపతిరావు దేవరాజ్‌తో పెళ్లికి ముందే పరిచయం ఉంది. అయితే తల్లిదండ్రులు ఆమెకు 2005లో రాజమండ్రికి చెందిన వ్యక్తితో వివాహం చేసారు. వారికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఉన్నారు. దేవరాజ్‌కు కూడా భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. అతడు ప్రస్తుతం రైల్వే గ్యాంగ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కాగా.. కమల పెళ్లైన నాటి నుండి.. ప్రియుడు దేవరాజ్ తో పరిచయాన్ని కొనసాగిస్తూ వచ్చింది. దీంతో ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈ క్రమంలోనే కమల భర్త తన ఇద్దరు కుమారులతో విడిపోయి దూరంగా ఉంటున్నారు. కమల తన ప్రియుడు దేవరాజును నమ్ముకుని 2012లో భర్త, పిల్లలను వదిలిపెట్టి టెక్కలికి వచ్చేసింది. కమల ఎవరినైతే నమ్ముకుని వచ్చిందో.. ఆ దేవరాజుకు అంతకు ముందే పెళ్లయ్యి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీంతో దేవరాజు తన భార్యా పిల్లలకు తెలియకుండా కమలను టెక్కలిలోని స్థానిక ఎన్టీఆర్‌ కాలనీ తొమ్మిదో లైన్‌లో అద్దె ఇంటిలో ఉంచాడు. అయితే వీరు సహజీనం చేయడం మొదలుపెట్టి 8 ఏళ్లు గడుస్తున్నా.. కమలను దేవరాజు పెళ్లి చేసుకోలేదు. దీంతో ఈ విషయాన్ని దేవరాజు వద్ద కమల ప్రస్తావించినప్పుడల్లా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. కమల ఉంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని భావించిన దేవరాజు ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కమల ఇంటికి వెళ్లిన దేవరాజు.. పెద్ద మనుషుల వద్ద సమస్యను పరిష్కరించుకుందామని నమ్మించి బైక్‌పై బొరిగిపేట గ్రామానికి తీసుకెళ్లాడు. సమస్య పరిష్కరించుకుందామని వెళ్లిన కమలను బొరిగిపేట శివార్లకు తీసుకువెళ్లిన దేవరాజు.. అక్కడ అసలు విషయం బయటపెట్టాడు. ఏ సమస్యా ఉండకూడదంటే.. నిన్ను చంపేస్తే గాని హాయిగా ఉండలేనంటూ చెప్పాడు. తర్వాత ఇంట్లో నుంచి కత్తి తెచ్చే సరికి కమల భయంతో అక్కడ నుంచి పరుగులు తీసింది. దేవరాజు కూడా వెంబడించి గ్రామ సమీపంలో వంశధార కాలువ వద్ద కత్తితో ఆమెపై దాడి చేశాడు. కలమ చేతులు, ఒంటిపై నరకడంతో తీవ్ర రక్తస్రావమై స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కమల చనిపోయిందని భావించిన దేవరాజు అక్కడ నుంచి వెళ్లిపోయాడు. కొంత సమయానికి కోలుకున్న కమల.. పాల వ్యాన్‌లో సీతాపురం గ్రామానికి చేరుకుంది. స్థానికుల సహకారంతో 108కి ఫోన్‌ చేయడంతో సిబ్బంది వచ్చి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు మహారాజ్‌ వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య వివరాలు సేకరించారు. కమలను కత్తితో నరికి గాయపరిచిన వారిలో దేవరాజుతో పాటు మరో వ్యక్తి ఉన్నాడని బాధితురాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దేవరాజును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ నీలయ్య, ఎస్‌ఐ కామేశ్వరరావు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)