'దేఖో మేరే ఢిల్లీ' యాప్‌ను ప్రారంభించిన కేజ్రీవాల్‌

Telugu Lo Computer
0


ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద కేజ్రీవాల్‌ 'దేఖో మేరే ఢిల్లీ' అనే యాప్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునే పర్యాటకులు 'దేఖో మేరే ఢిల్లీ' అనే ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చని ఆయన అన్నారు. అలాగే ఈ యాప్‌ ద్వారా పర్యాటకులు ఆహారం తీసుకునే ఫుడ్‌ జంక్షన్‌లు, వినోదాత్మక వేదికల గురించిన సమాచారం తెలుసుకోవడమే కాకుండా 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాలను కూడా గుర్తించవచ్చని ఆయన అన్నారు. ఇక ఢిల్లీ చుట్టుపక్కల ప్రజలు రాజధాని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి సరైన సమాచారం లేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారికి ఈ యాప్‌ ద్వారా సమాచారం అందివ్వడమే కాదు.. మరో రకంగా పర్యాటకరంగానికి ఊతమిచ్చేలా సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ యాప్‌ను ఢిల్లీ ప్రజలతో సహా అందరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన కోరారు. ఈ యాప్‌ పర్యాటకులు తమ పూర్తి ప్రయాణాన్ని ప్లాన్‌ చేసుకునేందుకు ఉపయోగపడుతుందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ యాప్‌ ద్వారా ఢిల్లీకి వచ్చే వ్యక్తులకు నగరంలోని ప్రదేశాల గురించి తెలియజేయగలమని ఆయన అన్నారు. అలాగే ఈ యాప్‌ను తయారుచేసేటప్పుడు తాము ఒక ఆహ్వాన పత్రికను తయారుచేసినట్లుగా అనిపించిందని ఆయన గుర్తుచేసుకున్నారు. సాధారణంగా ఢిల్లీ సందర్శనకు పర్యాటకులు ఒకటిన్నర రోజు సమయం కేటాయిస్తారు. అయితే పర్యాటకుల ఒక్కటిన్నర రోజుని కాస్తా రెండున్నర రోజులకి పెంచేలా చేయడమే మా ప్రయత్నం అని ఆయన అన్నారు. అలాగే ఈ యాప్‌పై ఆయన మాట్లాడుతూ 'ముఖ్యమంత్రి నాకు ఈ శాఖ బాధ్యతలు అప్పగించినప్పుడు మూడు రకాల వ్యక్తులను దృష్టిలో ఉంచుకుని పని చేయాలని నాకు ఆదేశించారు. మొదటిది  కొన్ని పనుల కోసం ఢిల్లీకి వచ్చేవారి కోసం, రెండవది ఢిల్లీని చూడటానికి వచ్చేవారి కోసం, మూడోది ఢిల్లీ ప్రజలు తమ కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లాలనుకునేవారి కోసం ఇలా మూడు రకాల వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని ఈ యాప్‌ను తయారుచేయడం జరిగిందని సిసోడియా అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)