యాక్టివ్‌ కేసులు 4లక్షలు దాటాయ్!

Telugu Lo Computer
0


దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 40వేల పైనే ఉంటున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా మరో 42,618 మంది వైరస్‌ బారినపడ్డారు. క్రితం రోజుతో పోలిస్తే 6శాతం తక్కువ కేసులు నమోదవడం కాస్త ఊరటనిస్తోంది. మరణాలు కూడా 400 దిగువనే ఉన్నాయి. అయితే కొత్త కేసులు పెరుగుతుండటంతో దేశంలో క్రియాశీల కేసులు మళ్లీ 4లక్షలు దాటడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,618 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.29 కోట్లు దాటింది. ఇదే సమయంలో 36,385 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.21కోట్ల మంది కొవిడ్‌ను జయించగా, రికవరీ రేటు 97.43శాతంగా ఉంది. నిన్న మరో 330 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. వైరస్‌ దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 4,40,225 మందిని బలితీసుకుంది. మరోవైపు కొత్త కేసులు పెరుగుతుండటంతో యాక్టివ్‌ కేసులు మళ్లీ 4లక్షలు దాటాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,05,681 మంది వైరస్‌తో బాధపడుతుండగా, క్రియాశీల రేటు 1.23శాతంగా ఉంది. కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న కేరళలో నిన్నకేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. అక్కడ 29,322 కొత్త కేసులు బయటపడగా.. 131 మరణాలు నమోదయ్యాయి. దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. నిన్న మరో 58.85లక్షల మందికి టీకాలు వేశారు. దీంతో ఇప్పటివరకు 67.72కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)