సార్ /మేడమ్ సంబోధన నిషేధం

Telugu Lo Computer
0


కేరళలోని పాలక్కడ్ జిల్లాలోని మధుర్ పంచాయితీ లోకల్ బాడీ మీటింగ్ పెట్టుకొని,  ఇకనుండి తమ కార్యాలయంలో ఉద్యోగులు సార్/మేడమ్ అని పిలిపించుకోవడాన్ని నిషేధించింది. అలా పిలిస్తేనే పనులు చేస్తాం అని ఉద్యోగులు ఎవరైనా అంటే, వారిపై చర్యలు ఉంటాయని తీర్మానించింది. సార్/మేడమ్ బదులు పేరు పెట్టి గానీ, ఆ ఉద్యోగి హోదా పెట్టి కానీ పిలవొచ్చు. పెద్దవారిని పేరుతో పిలవడం అగౌరవం అనిపిస్తే, అక్క/అన్న అని పిలవొచ్చు. అలాగే వినతి పత్రాలలో "అభ్యర్దిస్తున్నాను", బదులు డిమాండ్ చేస్తున్నాను లేదా కోరుకుంటున్నాను అని రాయవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో పౌరులు పొందగలిగిన ప్రతీ సేవా హక్కుగా వచ్చేదే. అటువంటప్పుడు చేతులు కట్టుకొని దీనంగా అభ్యర్థిస్తేనే పనులు జరగడం అనేది పౌరుల ఆత్మగౌరవాన్ని చంపేస్తుంది. అలాగని "ఆఫీసర్ల ముందు చేతులు కట్టుకోవాల్సిన పని లేదు, సార్/ మేడమ్ అని పిలవాల్సిన పనిలేదు" అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ప్రభుత్వం చేతులు దులుపేసుకుంటే సరిపోదు. ఎప్పుడైతే ఈ ఆప్షన్ పౌరుల చేతుల్లో పెడతామో, అది అమలు కాదు. అందుకే మధుర్ పంచాయతీ వారు చేసినట్టు ఇటువంటి రాచరిక పోకడల్ని  బ్యాన్ చేసి, నిషేధాన్ని అమలు చేసే బాధ్యతను ఉద్యోగుల చేతుల్లోనే పెట్టాలి. నిషేధాన్ని మీరిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవడమే సరైన పద్ధతి. 

మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అన్న మాటే గానీ రాచరికపు పద్ధతులు ఇంకా మోస్తున్నాం. మన ప్రభుత్వ కార్యాలయాల్లో రాయించే వినతి పత్రాల్లో చాలా ఓవర్ యాక్షన్ కనిపిస్తూ ఉంటుంది.  మహారాజశ్రీ................గారి దివ్యసుముఖమునకు అని అడ్రస్ చేస్తారు. ఇదేం పిచ్చి? వాళ్ళకో హోదా ఉండగా, ఈ పిలుపులు ఎందుకు? అలాగే, అయ్యా! అని మొదలు పెట్టిస్తారు. అయ్యా అంటే నాన్న అని. ఎందుకు రాయిస్తారో తెలియదు ఇలాంటి మాటలు. రోబోట్స్ లా పాతపద్దతులు ఫాలో అవడం తప్ప, రాసే పదం అర్థం ఏమిటి అనే ఆలోచనే ఉండదు. "నాయందు  దయ ఉంచి......." అని రాయిస్తారు. దయా? తన డ్యూటీ తాను చేయడం దయ తలచడమా? అలాగే చివర్లో "మీ విధేయడు/ విధేయురాలు" అని సంతకం చేయించుకుంటారు. 

వీళ్ళ ఉద్దేశంలో పౌరులు బానిసలా? 

ఆ మధుర్ పంచాయతీని ఆదర్శంగా తీసుకొని, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సమూలంగా మార్పులు తీసుకురావాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)