టికెట్ బుకింగ్ కి ఇవి తప్పనిసరా ?

Telugu Lo Computer
0


రైల్వే టికెట్‌ బుకింగ్‌లో కీలక మార్పులు జరగనున్నాయి. ఇక నుంచి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ట్రైన్ టికెట్లు బుక్ చేయాలంటే కచ్చితంగా ఆధార్ లేదా పాస్‌పోర్ట్ లేదా పాన్ లాంటి గుర్తింపు పత్రం ఉండాల్సిందేనని భారతీయ రైల్వే అంటోంది. ఆన్‌లైన్‌ టికెట్ల రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. పండుగ రద్దీ సమయాల్లో రైలు టికెట్లను పెద్ద మొత్తంలో బుక్ చేసుకుని, సీట్లను బ్లాక్ చేసే వారికి చెక్ పెట్టాలని రైల్వేశాఖ భావిస్తోంది. అలాగే వెబ్‌సైట్‌లోనూ భారీగా మార్పులు చేస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇకనుంచి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ తో కాకుండా కేవలం ఆధార్ నంబర్‌ లేదా పాస్‌పోర్ట్‌ నంబర్‌తో లాగిన్ అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల టికెట్ బుకింగ్‌లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది. అందుకే ఆధార్, పాస్‌పోర్ట్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. టికెట్‌ బుకింగ్‌కు పాన్‌, ఆధార్‌, పాస్‌పోర్ట్‌ వంటి గుర్తింపు కార్డులను తప్పనిసరి చేయడం ద్వారా ప్రయాణికులే టికెట్‌ తీసుకుంటారని, తద్వారా దళారీ వ్యవస్థ అంతమవుతుందని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌కుమార్‌ చెప్పారు. ఇందుకోసం ఓ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆధార్‌ అధికారులతో సంప్రదింపులు జరిపామని, త్వరలో మిగిలిన గుర్తింపు కార్డుల జారీ యంత్రాంగాలతోనూ చర్చిస్తామని చెప్పారు. 2019 అక్టోంబర్‌ -నవంబర్‌ నుంచి దళారులను పట్టుకోవడం ప్రారంభించామన్నారు. ఈ ఏడాది మే వరకు 14,257 మందిని అరెస్ట్‌ చేసినట్టు చెప్పారు. సుమారు రూ.28.34 కోట్ల విలువైన టికెట్లను సీజ్‌ చేసినట్లు తెలిపారు.

"ట్రైన్‌ టిక్కెట్లు వేగంగా బుక్‌ చేసేందుకు ఏజెంట్లు ఇతర సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి సమయంలో సాధారణ ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవాలంటే చాలా సమయం(కనీసం 10 నుంచి 15 నిమిషాలు) పడుతోంది. కొందరు ఏజెంట్లు అక్రమాలకు పాల్పడుతూ తప్పుడు పేర్లతో టికెట్లు బుక్ చేసుకుని, ప్రీమియం రేట్లకు అమ్ముకుంటున్నారు. ఆధార్ కార్డు అనుసంధానం చేస్తే ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లే. త్వరగా ఈ వ్యవస్థను తీసుకొచ్చేలా ఆర్‌ఫీఎఫ్ కృషి చేస్తోంది. పాస్‌పోర్టులను కూడా లింక్ చేసేందుకు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఓ నిర్ణయం రావొచ్చు. అప్పుడు టికెట్ బుక్ చేసుకునే వ్యక్తి ఆధార్ కార్డు, పాస్‌పోర్టు నంబర్లను వెబ్‌సైట్ గుర్తిస్తుంది. దీంతో అక్రమాలకు చెక్ పెట్టినట్లేనని అధికారులు భావిస్తున్నారు" అని అరుణ్ కుమార్ వెల్లడించారు.

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)