దాశరది గీతం.....

Telugu Lo Computer
0


ఆ చల్లని సముద్ర గర్భం 

దాచిన బడబానలమెంతో

ఆ నల్లని ఆకాశంలో కానరాని 

భాస్కరులెందరో                                 ||ఆ చల్లని||


భూగోళం పుట్టుక కోసం 

రాలిన సుర గోళాలెన్నో

ఈ మానవ రూపం కోసం 

జరిగిన పరిణామాలెన్నో

ఒక రాజుని గెలిపించుటలో 

ఒరిగిన నర కంఠములెన్నో

కుల మతాల సుడిగుండాలకు 

బలియైన పవిత్రులెందరో                 ||ఆ చల్లని||


మానవ కళ్యాణం కోసం 

పణమెత్తిన రక్తము ఎంతో

రణరక్కసి కరాళ నృత్యం 

రాచిన పసి ప్రాణాలెన్నో

కడుపు కోతతో అల్లాడిన 

కన్నులలో విషాదమెంతో

భూస్వాముల  దౌర్జన్యాలకు

ధనవంతుల దుర్మార్గాలకు

దగ్ధమైన బతుకులు ఎన్నో             ||ఆ చల్లని||


అన్నార్తులు అనాథలుండని 

ఆ నవయుగమదెంత దూరం

కరువంటూ కాటకమంటూ

 కనిపించని కాలాలెపుడో

పసిపాపల నిదుర కనులలో 

ముసిరిన భవితవ్యం ఎంతో

గాయపడిన కవి గుండెలలో 

రాయబడని కావ్యాలెన్నో            ||ఆ చల్లని ||


 దాశరది క్రిష్ణమాచార్య

Post a Comment

0Comments

Post a Comment (0)