అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపనున్న ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఘర్షణ ?

Telugu Lo Computer
0


జ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఘర్షణ వాతావరణం భారత్‌ సహా పలు దేశాల్లో చమురు ధరలపై పడనున్నట్లు అంచనా. సౌదీ అరేబియా, ఇరాక్‌, యూఏఈ దేశాల నుంచి అత్యధిక మొత్తంలో క్రూడ్‌ ఆయిల్‌ను భారత్‌ దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ వాతావరణం క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ చర్యలను కట్టడి చేసేందుకు పలు దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ తరుణంలో ఒకవేళ హర్మోజ్‌ జలసంధిని ఇరాన్‌ పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటే.. ముడి చమురు, ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) ధరలు పెరుగుతాయని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒమన్‌-ఇరాన్‌ సముద్ర మార్గంలో హర్మోజ్‌ జలసంధి ఉంటుంది. దాదాపు 40 కి.మీ మేర ఇరుకైన ప్రదేశం ఉండగా.. అందులో 2. కి.మీలు నౌకల రాకపోకల కోసం నావిగేషన్‌ ఛానల్‌ ఉంటుంది. సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఖతార్‌, ఇరాక్‌, ఇరాన్‌ దేశాల నుంచి వివిధ దేశాలకు రోజుకు 2.1కోట్ల (21మిలియన్‌) బారెళ్ల చమురు ఎగుమతి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా రోజువారి వినియోగంలో ఇది 21శాతం. అంతర్జాతీయంగా ఎల్‌ఎన్‌జీ వినియోగంలోనూ 20శాతం ఇక్కడ నుంచే సరఫరా జరుగుతోంది. భారత్‌ అవసరాల్లో 85శాతం క్రూడ్‌ ఆయిల్‌ సౌదీ, ఇరాక్‌, యూఏఈ నుంచి వస్తుండగా.. ఖతార్‌ నుంచి వచ్చే ఎల్‌ఎన్‌జీ కూడా ఈ జలసంధి మార్గంలోనే వస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ 'హర్మోజ్‌' జలసంధిని ఇరాన్‌ అడ్డుకుంటే.. చమురు రవాణాకు ఎర్ర సముద్రం (Red Sea) ప్రత్యామ్నాయంగా ఉంది. కానీ, ఎల్‌ఎన్‌జీ దిగుమతికి మాత్రం అటువంటి సౌలభ్యం లేదు. దీంతో భారత్‌లో ఇంధన ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్‌ పూర్తిగా లేదా పాక్షికంగా అడ్డుకుంటే.. క్రూడ్‌ ఆయిల్‌, ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) ధరలు పెరుగుతాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేర్కొంది. తాజా పరిస్థితులతో ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో వీటి ధరలు పెరిగే ముప్పు ఉందని మూడీస్‌ కూడా అంచనా వేసింది. ఇప్పటికే ఈ ఏడాది తొలి నుంచి క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగే ధోరణి కనిపిస్తోందని కేర్‌ఎడ్జ్‌ రేటింగ్స్‌ డైరెక్టర్‌ హార్దిక్‌ షా పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య పరిస్థితులు మరింత దిగజారితే.. ముడి చమురు ధరల పెరుగుదలకు దారి తీయవచ్చన్నారు. అయినప్పటికీ, రష్యా నుంచి భారత్‌కు ఇంధన దిగుమతులు ఇటీవల పెరగడం కాస్త ఊరట కలిగించే అంశంగా నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)