సుప్రీంకోర్టు స్టే తో 17 లక్షల మంది మదర్సా విద్యార్థులకు ఊరట !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌ బోర్డ్ ఆఫ్ మదర్సా ఎడ్యుకేషన్ యాక్ట్- 2004ను రద్దు చేస్తూ గత నెలలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. దీని ద్వారా సుమారు 17 లక్షల మంది మదర్సా విద్యార్థులకు సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించినట్లయింది.  దీంతో రాష్ట్రంలోని 16,000 మదర్సాలు యథావిధిగా కొనసాగనున్నాయి. హైకోర్టు నిర్ణయం ప్రాథమికంగా సరికాదని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మదర్సా చట్టం-2004 సెక్యులరిజం సూత్రాలను ఉల్లంఘిస్తోందని, ఇది రాజ్యంగ విరుద్దమంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని తెలిపింది. ఈ తీర్పు 10 వేల మదర్సా టీచర్లు, 17 లక్షల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతోందని పేర్కొంది. మదర్సాలో మ్యాథ్స్‌, సోషల్‌ స్టడీస్‌, సైన్స్‌ సబ్జెక్టులను కూడా మదర్సాల్లో బోధిస్తున్నారని, అక్కడి విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించే అవసరం లేదని తాము భావిస్తున్నట్లు సీజేఐ పేర్కొన్నారు. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థించాయి. అనుమానిత మతం, ఇతర సంబంధిత అంశాలపై చర్చ జరగాలని కోరాయి. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. మదర్సా బోర్డ్‌ లక్ష్యం, ఉద్దేశం నియంత్రణ స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, సెక్యులరిజాన్ని ప్రభావితం చేయదంటూ తెలిపింది. ఈ అంశంపై లేవనెత్తిన సమస్యలను మరింత నిశితంగా పరిశీలించాల్సి వుందని సీజేఐ చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఉత్తర ప్రదేశ్‌ , కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశారు.తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. 




Post a Comment

0Comments

Post a Comment (0)